Hyderabad | హైడ్రా (Hydra), మూసీ కూల్చివేతల విషయంలో బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. దీనిపై ఈరోజు కార్యాచరణ ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మూసీ (Musi) సుందరీకరణలో భాగంగా బాధితులైనవారి తరఫున తమ పోరాటం ఉంటుందని తెలిపారు. బుధవారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కిషన్ రెడ్డి పర్యటించారు. అంబర్‌పేట్, అసెంబ్లీ, ముసారాంబాగ్, అంబేడ్కర్ నగర్, తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ లో ఆయన పర్యటించి బాధితులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మూసీ నిర్వాసితులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదుట తమ కష్టాలను వివరించారు. ఇళ్లు కోల్పోతే రోడ్డున పడతామని కన్నీళ్ల పర్యంతమయ్యారు. మీరే దిక్కంటూ బోరున విలపించారు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమను ఇక్కడ్నుంచి పంపించవద్దంటూ కోరారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఇళ్లు కట్టుకున్నామని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తమను ఆదుకోవాలని కోరారు.
బాధితుల గోడు విన్న మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) వారిని ఓదార్చారు. ఇండ్లు కూల్చే పరిస్థితి వస్తే తానే అడ్డుగా నిలబడి రక్షిస్తానని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని, నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పేదలకు అండగా నిలిచేందుకు తాము యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైడ్రా కూల్చివేతలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని అన్నారు. ఇండ్ల కూల్చివేతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఇళ్ల కూల్చడంతో కేంద్రానికి ఏం సంబంధం ఉంది. దీనిపై ఆయనే చెప్పాలి అనికిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతో మంది పేదలు రోడ్డున పడే దుస్థితి నెలకొందని, మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. గురువారం కొత్త కార్యాచరణ అమలు చేస్తామని,కాంగ్రెస్ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..