Karimnagar Hasanparthy Railwayline : ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా కరీంనగర్ నుంచి హసన్ పర్తి వరకు చేపట్టే రైల్వేలైన్ నిర్మాణ పనులపై కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలోని తాడికల్, మక్త, మొలంగూర్, లింగాపూర్ గ్రామాల మీదుగా రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. పలు ప్రాంతాలలో యంత్రాల సాయంతో మట్టి తవ్వకాలు చేశారు. మట్టి దృఢత్వం, రాళ్లు, నేల పరిస్థితిని అంచనా వేసేందుకు నమూనాలు సేకరిస్తున్నారు.
కాగా కరీంనగర్(Karim nagar) ¬- హసన్ పర్తి (Hasanparthi) రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలు వ్యయం సుమారు రూ. 1,116 కోట్లు. ఈ రైలు మార్గం పూర్తయితే.. మానకొండూర్, శంకరపట్నం, హుజూరాబాద్ (Huzurabad) వాసులకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. అలాగే విజయవాడ, చెన్నై, తిరుపతి వైపు సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో రైల్ కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త రైల్వే లైన్ల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు 15 ఫైనల్ స్టేజ్ సర్వే (FLS) ని మంజూరు చేసింది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైన్లు కలిపి దాదాపు 2,647 కి.మీ దూరం వరకు విస్తరించి ఉన్నాయి. అంచనా వ్యయం దాదాపు రూ. 50848 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా దాదాపు రూ. 32,695 కోట్లతో 2,588 కి.మీ.ల దూరానికి డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రాప్లింగ్ కోసం మరో 11 ప్రాజెక్టులక ఎఫ్‌ఎల్‌ఎస్ మంజూరు చేసింది రైల్వేశాఖ.
మానకొండూర్, హుజురాబాద్ వాసులకు మేలు..
రైల్వే మంత్రిత్వ శాఖ ఫైనల్ స్టేజ్ సర్వే మంజూరు చేసిన ముఖ్యమైన ప్రాజెక్టులలో కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ కూడా ఒకటి. ఈ ముఖ్యమైన లైను దాదాపు 62 కిలోమీటర్లు ఉండనుంది. దీని అంచనా వ్యయం దాదాపు రూ. 1,116 కోట్లు, ఈ లైన్ మానకొండూర్, హుజూరాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలను హైదరాబాద్‌తో అనుసంధానించే అవకాశం ఉంది, విజయవాడ, చెన్నై మరియు తిరుపతి వైపు నేరుగా కనెక్టివిటీని సులభతరం చేస్తుంది.
ఈ కొత్త రైల్వే లైన్.. కాజీపేట – పెద్దపల్లి మధ్య ప్రధాన మార్గానికి ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేయనుంది. కొత్త రైల్వే లైన్ మొదటిసారిగా అనేక కొత్త ప్రాంతాలను రైలు సౌకర్యంతో అనుసంధానించడమే కాకుండా ఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇది వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణ మొదలైన రంగాల కోసం తెలంగాణ రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగించేందుకు సహాయపడుతుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..