Indias First Bullet Train | దేశంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైలు (Bullet Train)కు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’ (Rising Bharat Summit) లో పాల్గొన్న మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కీలక విషయాలు వెల్లడించారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని వెల్లడించారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడిపించనున్నట్లు ప్రకటించారు. 2028 వరకు ముంబై – అహ్మదాబాద్ మార్గం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు.
కాగా భారతీయ రైల్వే.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తోంది. జపాన్ కు చెందిన షింకన్‌సెన్ టెక్నాలజీ సాయంతో హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోంది. సుమారు రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ భూసేకరణలో అనేక అడ్డంకులు ఎదురు కావడంతో జాప్యం చోటుచేసుకుంది. మొత్తానికి 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైలును నడపాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఇక ఈ మొత్తం బులెట్ ట్రైన్ కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబై నగరానికి చేరుకోవచ్చు.
అధునాతన ఫీచర్లు
బుల్లెట్ రైలులో అనేక ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రారంభంలో, బుల్లెట్ రైలులో 10 కోచ్‌లు ఉంటాయి, ఇందులో 750 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. అయితే, 2033 నాటికి 1,250 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం కలిగిన కోచ్‌ల సంఖ్యను 15కు పెంచనున్నారు. సౌకర్యవంతమైన సీట్లు కాకుండా, బుల్లెట్ రైలులో వాక్యూమ్ టాయిలెట్లు, బహుళ ప్రయోజన గది, బేబీ టాయిలెట్ సీట్లు వంటి ఇతర ఫీచర్లు ఉంటాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..