హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ (Hyderabad Old City) లో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. న్యూఢిల్లీలో ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్‌గా, విద్యుత్ పంపిణీ, విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలను అదానీ కంపెనీకి అప్పగిస్తామని సిఎం రేవంత్ చెప్పారు. సేకరించిన మొత్తంలో 75% రాష్ట్ర ఖజానాకు, మిగిలిన 25% అదానీకి వస్తాయని రేవంత్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అదానీ గ్రూపు ఆమోదం తెలిపిందని, కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
బిల్లుల వసూలంటే ముచ్చమటలే..
కాగా హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియ అత్యంత సవాల్ తో కూడుకున్నది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడం వంటివి తరచూ ఇక్కడ జరుగుతుంటాయి. పాతబస్తీలో విద్యుత్ మీటర్ రీడింగ్ రికార్డు చేసేందుకు కూడా కొందరు విద్యుత్ సిబ్బందిని ఇళ్లలోకి రానివ్వడం లేదు. ఇటీవల బిల్లులు చెల్లించలేదన్న కారణంతో విద్యుత్ కనెక్షన్ తీశారంటూ ఓ ఇంటి యజమాని విద్యుత్ సిబ్బందిపై కత్తితో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తరచూ ఇలాంటి దాడులు జరుగుతుండటంతో పాతబస్తీలో విధులు నిర్వహించేందుకు విద్యుత్ సిబ్బంది భయపడిపోతున్నారు. దీంతోపాటు పాతబస్తీలో మీటర్ ట్యాంపరింగ్, దొంగతనాలు కూడా ప్రధాన సమస్యగా మారాయి.
సమస్యలపై అదానీ గ్రూప్ అధ్యయనం..
విద్యుత్ బిల్లుల వసూళ్లు, దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి అదానీ గ్రూప్ ప్రతినిధులు ఇప్పటికే తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) నుంచి సమాచారాన్ని సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్‌కు చెందిన కార్పొరేట్ బృందం గత కొన్ని నెలలుగా ఓల్డ్ సిటీకి సంబంధించిన విద్యుత్ సరఫరా, ఇతర సమస్యలపై అధ్యయనం చేస్తోందని వర్గాలు తెలిపాయి.
బిల్లుల వసూలు ప్రక్రియను మొదట పాతబస్తీ (Hyderabad Old City)లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరం అంతటా విస్తరించనున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తం గా ఈ బాధ్యతను అదానీ గ్రూప్‌కు అప్పగిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
బీఆర్ఎస్ విమర్శలు
అయితే ఈ విషయమై బీఆర్ఎస్ మండిపడింది. తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను ప్రైవేటీకరించేందుకు రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది. డిస్కమ్‌లను ప్రైవేటీకరించే దిశగా ఇది తొలి అడుగు అని పేర్కొంది. “మొదట, హైదరాబాద్‌లో కరెంట్ బిల్లుల వసూళ్లను రేవంత్ ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు అప్పగించబోతోందని, ఇదే జరిగితే భవిష్యత్తులో విద్యుత్, విద్యుత్ కనెక్షన్ల కోసం తెలంగాణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు అదానీ ముందు మోకరిల్లాల్సి వస్తుంది’’ అని బీఆర్‌ఎస్ పేర్కొంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..