Tuesday, January 20Thank you for visiting

RRR Alignment | రీజిన‌ల్ రింగ్ రోడ్ పై స‌ర్కారు కీల‌క ఆదేశాలు.

Spread the love

RRR Alignment | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ( Regional Ring Road (RRR)) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేలా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూత‌నంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Highlights

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ హైవే అంశాలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని త‌న‌ నివాసంలో సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు.

దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన‌గల్ – చేవెళ్ల – శంకర్ పల్లి – సంగారెడ్డి వరకు) అధికారులు రూపొందించిన అలైన్‌మెంట్‌లో మరి కొన్ని మార్పులు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్ఇ సూచించారు. ప్ర‌తిపాదిత రేడియ‌ల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ స‌మీక‌ర‌ణ, భూ సేక‌ర‌ణ‌ చేయాల‌న్నారు. భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు.

మనదగ్గర డ్రైపోర్టును ఏపీలోని మ‌చిలీప‌ట్నం, కాకినాడ రేవుల‌తో అనుసంధానం చేసే అవకాశాలపై అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత‌నే గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని, ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వేస్ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

#ORR – #RRR మ‌ధ్య రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్ వ‌ర‌కు నిర్మించ‌నున్న ర‌హ‌దారిలో మూడు చోట్ల ఉన్న అట‌వీ ప్రాంతాల‌ను నైట్ స‌ఫారీలుగా మార్చే అంశంపై కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. కాలిఫోర్నియాలో ఆపిల్ పండ్ల తోటలోనే ‘ఆపిల్’ సంస్థ కార్యాలయం, బెంగ‌ళూరులో జిందాల్ నేచ‌ర్ కేర్ తరహాలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలోనూ పర్యావరణహిత నిర్మాణాలపై స‌మ‌గ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రకృతి సౌంద‌ర్యానికి నెలవైన రాచకొండ ( Rachakonda)లో సినీ ప‌రిశ్ర‌మ‌ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని సీఎం ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానిచారు.

ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కావ‌ల‌సిన భూ స‌మీక‌ర‌ణ‌, భూ సేక‌ర‌ణ విష‌యంలో అన్ని శాఖ‌ల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, లేకుంటే శాఖాప‌ర‌మైన‌ చర్యలు తప్పవని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *