HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు

HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు
Spread the love

చైనా నుంచి విస్త‌రిస్తున్న‌ హ్యూమ‌న్ మెటాప్న్యూమో వైర‌స్ (HMPV)) మ‌న భార‌తదేశంలోనూ కల‌వ‌ర‌పెడుతోంది. కేసులు క్ర‌మేణా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి రెండు కేసులు న‌మోదు కాగా, గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ఒక‌టి, చెన్నైలో రెండు కేసులు వెలుగు చూడ‌గా తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌ (Nagpur)లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఏడు, 14 ఏళ్ల చిన్నారులు ఈ HMPV బారిన‌ప‌డ్డారు.

జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతుండ‌టంతో..

HMPV Symptoms : జ్వ‌రం, ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్న ఈ పిల్ల‌ల‌ను రమదాస్‌పేట్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రికి జ‌న‌వ‌రి 3న తీసుకెళ్లారు. అనంత‌రం ప‌రీక్షించిన వైద్యులు వీరు హెచ్ఎంపీవీ వైర‌స్ బారిన ప‌డ్డార‌ని నిర్ధారించారు. కొవిడ్-19కి సారూప్యమైన ఈ వైరస్ పై, కింది శ్వాసకోశాలను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి దీని ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు.

అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

HMPV కేసులు న‌మోదైన నేప‌థ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. ఇవి మ‌రిన్ని పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌క‌టించింది. దగ్గు, జ్వరం లేదా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ (Severe Acute Respiratory Infections – SARI) ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు జారీ చేసింది. ధైర్యంగా ఉండాల‌ని, భ‌యాందోళ‌న చెందొద్ద‌ని సూచించింది. ఈ వైరస్‌ను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.

దేశవ్యాప్తంగా HMPV కేసులు

తాజాగా రెండు కేసులతో కలిపి దేశంలో HMPV కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ జాబితాలో అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల బాలుడు కూడా ఉన్నాడు. అలాగే బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రకు పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటకల్లో ఇప్ప‌టికే ఈ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. రెండు కేసులు తమిళనాడులో నమోదయ్యాయి. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌జారోగ్యాన్ని కాపాడేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని పేర్కొంది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురికావ‌ద్ద‌ని సూచించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ‌ కార్యదర్శి సమీక్ష

హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ నేప‌థ్యంలో ప‌రిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ రోజు సమీక్షించారు. దేశంలో శ్వాసకోశ వ్యాధులు భారీగా పెరుగుతున్నట్లు ఎలాంటి సూచనలూ లేవని, కానీ పటిష్టమైన పర్యవేక్షణ కొనసాగుతోంద‌ని ఆయన తెలిపారు. రాష్ట్రాల్లో ప్రజలకు అవగాహన పెంచాలని, అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల పర్యవేక్షణను మెరుగుపరచాలని అన్నారు.

త‌గిన జాగ్రత్తలు అవసరం

HMPV Precaution : హెచ్ఎంపీవీ వైరస్ ప్రబలకుండా వ్యక్తిగత శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. దగ్గు, జ్వరంతో బాధపడేవారు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకోవడం మంచిది. భ‌యాందోళ‌న‌కు గురికాకుండా త‌గిన అవ‌గాహ‌న‌తో వైరస్ వ్యాప్తిని నియంత్రించొచ్చు. ముందు జాగ్రత్తలు పాటించడం అంద‌రి బాధ్యత.


Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *