Rythu Runa Mafi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే.. అయితే పలు సాంకేతిక కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వం.. రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించింది. ఇక త్వరలోనే వీరికి రుణమాఫీ స్కీమ్ ను వర్తింపజేయనుంది.
రుణమాఫీ కాని రైతుల విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) కీలక ప్రకటన చేశారు. బుధవారం షాద్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పలు కారణాలతో రుణమాఫీ జరగని 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. నవంబర్ 30న మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు పండగ సందర్భంగా డబ్బులు జమ చేయనున్నామని ప్రకటన చేశారు.
కాగా రైతు రుణమాఫీ (Rythu Runa Mafi ) కి రూ.18 వేల కోట్లు ఖర్చు చేశామని.. రాష్ట్రంలోని మిగతా రైతులకు కూడా అందజేస్తామని తెలిపారు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కోసం ఇంతకాలంపలువురు రైతులకు మాఫీ కావడంలో జాప్యం జరిగిందని చెప్పారు. వ్యవసాయ శాఖాధికారులు గత 3 నెలలుగా రైతుల వివరాలు సేకరించి తప్పులను సవరించారని చెప్పారు. వీరందరికీ ఈనెల 30వ తేదీన డబ్బులు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.