Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్ – నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు చేసినట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా ఇక నుంచి ఈ రైలు 5.43 గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ఈ మార్పు అక్టోబరు 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. మిగతా రైల్వేస్టేషన్ల సమయంలో ఎలాంటి మార్పులు లేవని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది.
కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలు 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. నాగ్‌పూర్ -సికింద్రాబాద్ (20101) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్ బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్-నాగ్‌పూర్ (20102) రైలు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ స్టేషన్ కు చేరుకుంటుంది. సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హర్షా, రామగుండం, కాజీపేట స్టేషన్లలో ఈ వందేభారత్ రైలు ఆగుతుంది.
సీట్లు ఖాళీ.. తగ్గనున్న కోచ్ ల సంఖ్య
ఇదిలా ఉండగా తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలను పెంపొందించడానికి ఈ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానించడానికి కొత్తగా వందేభారత్ ను నడుపుతున్నారు. అయితే ఈ ట్రైన్ రెండు వైపులా రోజువారీగా 80 శాతం ఖాళీతో ట్రైన్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. ఆదివారం (సెప్టెంబర్ 22) 1,200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే 88 సీట్లు ఉండే 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో 10 కంటే తక్కువ మంది ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్నారు. ఈ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ ఇలాగే కొనసాగితే కోచ్‌ల సంఖ్యను తగ్గించాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ప్రస్తుత 20గా ఉన్న కోచ్‌ల సంఖ్యను 8కి తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఇలా చేస్తే సీట్ల సంఖ్య 500కు తగ్గిపోతుంది. కాగా, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్ననేథ్యంలో ఈ రైలును మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్‌లోనూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..