Telangana Free Bus Service : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే డిమాండ్ కు తగినట్లుగా ఎక్స్‌ప్రెస్ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) పెంచడం లేదు. దీంతో బస్ స్టాండ్లు, బస్ స్టాపుల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఒకవేళ బస్సులు వచ్చినా అవి పూర్తిగా జనంతో నిండిపోయి కనీసం నిలబడి ప్రయాణించే వీలు కూడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు గత్యంతరం లేక డబ్బులు చెల్లించి డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళలను డీలక్స్ బస్సులవైపు వారిని మళ్లించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మహిళలను డీలక్స్ బస్సులవైపు ఆకర్షించేందుకు తాజాగా డీలక్స్ బస్సు (Deluxe Bus ) ఎక్కితే వారికి బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ఆర్టీసీ ప్రారంభించింది. హనుమకొండ – హైదరాబాద్ రూట్ లో జనగామ డిపో ఇలా 3 డీలక్స్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ డీలక్స్ బస్సుల్లో డబ్బులు చెల్లించి ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు గిఫ్ట్లు ఇస్తామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
బస్సుల్లో పెరిగిన ఆక్యుపెన్సీ
తెలంగాణలో మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో ఆక్యుపెన్సీ వంద శాతం దాటిపోయింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 120 శాతానికి పైగా ఉంటోంది. ఆర్డినరీ బస్సుల్లో కంటే ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా స్టాపులు తక్కువ, వేగం ఎక్కువ కాబట్టి మహిళలు, పురుషులు ఎక్కువగా ఎక్స్ ప్రెస్ బస్సులకే మొగ్గు చూపుతున్నారు. ఈ కారణాల వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా నష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, డీజిల్ వినియోగం, ఉద్యోగులు, సిబ్బంంది జీతభత్యాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆర్టీసీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. దూర ప్రాంత బస్సు సర్వీసులను తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈమేరకు ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు కొన్నాళ్ల క్రితం ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంంతో పలు అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశారు.
ఉచిత ప్రయాణ పథకం (Telangana Free Bus Service ) వచ్చిన తర్వాత జనగామ నుంచి బాసరకు ఉన్న బస్సు సర్వీసును రద్దు చేసింది. కరీంనగర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు సూర్యాపేట, మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్ బస్సులను కూడా రద్దు చేయగా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ ప్రారంభించారు. కోదాడ-కర్నూలు, మిర్యాలగూడ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ బస్సులను కూడా రద్దు చేశారు. భూపాలపల్లి-గుంటూరు, పరకాల-గుంటూరు ఎక్స్‌ప్రెస్ బస్సులను కూడా ఉపసహరించుకుంది. దీంతో పాటు బస్సు సర్వీసుల సంఖ్యను కూడా తగ్గించేందుకు ఆర్టీసీ యాజమాన్యం యత్నిస్తోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..