Rythu Runa Mafi | గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోమారు స్పష్టం చేశారు. కాగా రుణమాఫీకి సంబంధించి ప్రక్రియను ప్రభుత్వం ఇదివరకే ప్రారంభించింది. ఢిల్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ఏమాత్రం ప్రామాణికం కాదని అన్నారు. అది కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ చేయబోమని తేల్చి చెప్పారు. కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ (Rythu Runa Mafi) ఉంటుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉచిత బస్సు పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు..
రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు.. ఇతర పథకాలపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Scheme ) పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని అన్నారు. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోంది. 30శాతం నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెరిగిందని చెప్పారు. తద్వారా ఆర్టీసీకి నిర్వహణ నష్టాలు తగ్గాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాలబాటలో పయనిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత రవాణా సదుపాయం వల్ల టెంపుల్ టూరిజం పెరిగింది. అక్కడ జీఎస్టీ కూడా పెరిగింది’ అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్నా గానీ.. తాము ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుంది. కొత్త వారిని నియమించాక కుల గణన చేస్తామన్నారు.
ప్రతీ నెలా 7వేల కోట్ల అప్పులు కడుతున్నాం..
తెలంగాణ రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రతీనెల రూ. 7 వేల కోట్ల అప్పులు కడుతున్నామని తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు రూ. 6,500 కోట్లు కట్టేవారు. గత ప్రభుత్వం 7 నుంచి 11 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారు. రుణ భారం తగ్గేలా రుణాల వడ్డీని తగ్గించునేందుకు యత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కశాతం తగ్గినా రూ. 700 కోట్లు ఆదా అవుతాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోత లేదు పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని సీఎం అన్నారు. ఉచిత పథకాలను తప్పుపట్టడం సరికాదని, అవసరం ఉన్నవారికే సంక్షేమ పథకాలు అందాలన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..