- ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు సెగ.. లీటర్‌పై మళ్లీ పెరిగిన రేట్లు
- మే 16 నుండి కేవలం వారం రోజుల్లోనే మూడోసారి ధరల సవరణ
- చమురు సంస్థలకు నెలకు రూ. 1,000 కోట్ల నష్టాలు.. భారం సామాన్యుడిపైకే!
Petrol Price Hike May 2026 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరల నుండి పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు సామాన్యుడిపై మరోసారి పెట్రో భారాన్ని మోపాయి. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం లీటర్ పెట్రోల్ ధరపై 87 పైసలు, అలాగే లీటర్ డీజిల్ ధరపై 91 పైసలు మేర అదనంగా పెరిగాయి.
దేశీయ ఇంధన ధరలలో సుదీర్ఘకాలంగా నెలకొన్న సాపేక్ష స్థిరత్వానికి ముగింపు పలుకుతూ మే నెలలోనే చమురు సంస్థలు ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ వారం ప్రారంభంలో (మే 19న) ఇంధన ధరలను లీటరుకు దాదాపు 90 పైసలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా వడ్డన జరిగింది. అంతకుముందు మే 16న దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 3 మేర ఇంధన ధరలను పెంచుతూ కేంద్రం భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ ఉద్రిక్తతల సెగ
మధ్యప్రాచ్యంలో (Middle East) కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై నెలకొన్న తీవ్ర అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు నిరంతరం అస్థిరంగా మారుతున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 104 డాలర్లకు పైగా పెరగ్గా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ బ్యారెల్‌కు 97 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది. ఒక దశలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఏకంగా 111 డాలర్లకు చేరువవడంతో, ప్రపంచవ్యాప్తంగా సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా చమురు కంపెనీలు వరుస ధరల సవరణల ద్వారా ఆ భారాన్ని కొంతమేర వినియోగదారులపైకి నెట్టడం ప్రారంభించాయి.
జాతీయ మెట్రో నగరాల్లో తాజా ఇంధన ధరలు (RSP)
| నగరం (City) | లీటర్ పెట్రోల్ ధర (మార్పు) | లీటర్ డీజిల్ ధర (మార్పు) |
| ఢిల్లీ (Delhi) | ₹99.51 (+0.87 పైసలు) | ₹92.49 (+0.91 పైసలు) |
| ముంబై (Mumbai) | ₹108.49 (+0.90 పైసలు) | ₹95.02 (+0.94 పైసలు) |
| కోల్‌కతా (Kolkata) | ₹110.64 (+0.94 పైసలు) | ₹97.02 (+0.95 పైసలు) |
| చెన్నై (Chennai) | ₹105.31 (+0.82 పైసలు) | ₹96.98 (+0.87 పైసలు) |
చమురు సంస్థలకు భారీ నష్టాలు
గడిచిన కొన్ని నెలలుగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (HPCL, IOCL, BPCL) పెట్రోల్, డీజిల్ ధరలను చాలా వరకు యథాతథంగా ఉంచాయి. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం.. ధరలను స్థిరంగా ఉంచడం వల్ల ఈ కాలంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా దాదాపు రూ. 1,000 కోట్ల భారీ నష్టాలను చవిచూశాయి. ఈ నష్టాల తీవ్రత ఎక్కువ కావడంతోనే ప్రస్తుతం వరుస పెంపులు అనివార్యమయ్యాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
సంక్షోభంలోనూ భారతదేశపు స్థైర్యం: మంత్రి హర్దీప్ సింగ్ పూరి
ఇటీవలే సిఐఐ (CII) వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. పటిష్టమైన విధాన సమన్వయం మరియు సమర్థవంతమైన సరఫరా నిర్వహణ ద్వారా ప్రపంచ ఇంధన సంక్షేమాలను భారతదేశం ధీటుగా ఎదుర్కొందని పేర్కొన్నారు. “ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో అంతరాయాలు, పెరుగుతున్న ముడి చమురు ధరల తరుణంలోనూ భారతదేశం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజిల నిరాటంక లభ్యతను నిర్ధారించింది. దేశంలో ఎక్కడా కొరత అనేదే రాలేదు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి దేశీయ ఎల్‌పిజి (LPG) ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచాం” అని మంత్రి స్పష్టం చేశారు.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సానుకూలంగా మారితే తప్ప రాబోయే రోజుల్లో దేశీయంగా ఇంధన ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳










