న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మరో బిగ్ షాక్ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA Scam) స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు బహుమతిగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితుల విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు ఈడీ (Enforcement Directorate) కి అధికారం దక్కినట్లయ్యింది.
ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు వచ్చాయి. కుంభకోణం (MUDA Scam) లో ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం పాటు స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్ కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశించారు. అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. గవర్నర్ తిరస్కరించారు. ఈ వ్యవహారం కోర్టుకుచేరగా కోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఆయన్ని విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతిచ్చింది. అనంతరం సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..