Warangal | సమస్యలను వెలికితీయడమే కాదు.. పరిష్కార మార్గాలను కూడా సూచించండి..
జర్నలిస్టులకు పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా చేస్తా..
పోలీస్‌కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
Warangal: వర్కింగ్ జర్నలిస్టులకు పోలీస్ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal CP) అంబర్ కిషోర్ ఝా అన్నారు. జర్నలిస్టులు సమస్యలను వెలికితీయడంతోపాటు, పరిష్కార మార్గాలను కూడా సూచించాలని కోరారు. హైదరాబాద్, బెంగళూర్, మైసూర్ వంటి నగరాలతో సమానంగా గ్రేటర్ వరంగల్ నగరం అభివృద్ధి చెందాలంటే జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మీటింగ్ హాల్‌లో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా సీపీ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా పలువురు ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యులకు ఐడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎంతో ఘనమైన చారిత్రక నేపథ్యం గలిగిన వరంగల్ లో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. వరంగల్ నగరంలో పనిచేసిన అధికారులకు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ నుంచి జర్నలిస్టులకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులకు ట్రాఫిక్ ఆంక్షలతో కలిగే ఇబ్బందులను తొలిగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ సభ్యులకు అత్యాధునిక సాంకేతిక సహకారంతో రూపొందించిన ఐడీ కార్డులను అందజేస్తున్నామని తెలిపారు. డూప్లికేట్ చేయడానికి వీలులేకుండా సభ్యుల ప్రాథమిక సమాచారం తెలియజేసే కార్డులు ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన సభ్యుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కొందరు పనిగట్టుకుని బురద జల్లే విధంగా చేసే ఆరోపణలను సభ్యులు పట్టించుకోవద్దని కోరారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హన్మకొండ అధ్యక్షుడు తోట సుధాకర్, వరంగల్ అధ్యక్షుడు మట్టా దుర్గాప్రసాద్, టీయూడబ్ల్యూజే (143) వరంగల్ అధ్యక్షుడు మెండు రవీందర్ , టీఏజేఎఫ్ రాష్ట్ర నాయకుడు నూటంకి ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టులు పెండెం వేణుమాధవ్, వేముల సదానందం, గునిశెట్టి విజయ్‌భాస్కర్, ప్రెస్ క్లబ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు గోకారపు శ్యామ్, బొడిగె శ్రీను, దుర్గా ప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యాంసాని శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు సంపెట సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్దన్, ఈసీ మెంబర్లు నయీంపాషా, వేణుగోపాల్, దిలిప్ కుమార్, సంజీవ్, భరత్, విజయ్‌రాజ్ పాల్గొన్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..