Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచరుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల, ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొందరు అనుమానితుల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల నిల్వలు ఉన్నట్లు సమాచారం అందిందని వారు తెలిపారు. “మేము సోదాల సమయంలో విదేశీ పిస్టల్స్‌తో సహా 12 తుపాకీలను స్వాధీనం చేసుకున్నాము. అంతేకాకుండా, బాక్సుల లోపల పేర్చబడిన పేలుడు పదార్థాలను కూడా కనుగొన్నామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి మీడియాకు చెప్పారు. తనిఖీల సమయంలో ఏదైనా పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి)ని పిలవాల్సి వచ్చిందని తెలిపారు. కాగా జనవరి 5న, సందేశ్‌ఖాలీలో రేషన్ స్కామ్‌కు సంబంధించి షాజహాన్ నివాసంలో తనిఖీలు చేయడానికి వెళ్లిన ED అధికారుల బృందంపై దాడి జరిగింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ దాడిపై సీబీఐ విచారణ జరుపుతోంది.
“ఈ కేసు దర్యాప్తు సమయంలో, ED బృందం కోల్పోయిన వస్తువులు, సందేశ్‌ఖాలీలోని షాజహాన్ సహచరుడి నివాసంలో దాచిపెట్టవచ్చని సమాచారం అందింది. దీంతో సిబిఐ బృందం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బందితో కలిసి సందేశ్‌ఖాలీలోని రెండు అనుమానాస్పద వ్యక్తుల నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో మూడు విదేశీ రివాల్వర్లు, ఒక భారతీయ రివాల్వర్, ఒక పోలీసు రివాల్వర్, ఒక విదేశీ పిస్టల్, ఒక దేశీయ పిస్టల్, 9ఎంఎం 120 బుల్లెట్లు, .45 క్యాలిబర్ 50 కాట్రిడ్జ్‌లు, 120 9ఎంఎం కాట్రిడ్జ్‌లు సహా పలు ఆయుధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, షాజహాన్‌కు సంబంధించిన అనేక నేరారోపణ పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశీయంగా తయారు చేసిన బాంబులుగా అనుమానిస్తున్న కొన్ని వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎన్‌ఎస్‌జికి చెందిన బృందాలు పరిశీలించి డిస్పోజల్ చేస్తున్నాయని తెలిపారు.
Sandeshkhali Raids : షాజహాన్ కు చెందిన సుమారు 1,000 మందితో కూడిన గుంపు దాడిలో ముగ్గురు ED అధికారులు గాయపడిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై , ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ బసిర్హాట్ పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దాడికి బాధ్యుడైన షాజహాన్ దాదాపు రెండు నెలల పాటు పరారీలో ఉన్నారు. ఫిబ్రవరి 29 న రాష్ట్ర పోలీసులు అతడిని అరెస్టు చేసి సిబిఐకి అప్పగించారు.
#WATCH | CBI is conducting multiple raids in West Bengal in connection with the Sandeshkhali case.
Visuals from North 24 Parganas. pic.twitter.com/iXhD1w76zG
— ANI (@ANI) April 26, 2024
అరెస్టయిన బెంగాల్ రాష్ట్ర ఆహార మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్‌తో షాజహాన్‌కు సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో అక్రమాల ద్వారా వచ్చిన మొత్తం రూ.9,000-10,000 కోట్లు అని, ఇందులో రూ.2,000 కోట్ల మొత్తాన్ని నేరుగా లేదా బంగ్లాదేశ్ ద్వారా దుబాయ్‌కి తరలించినట్లు అనుమానిస్తున్నట్లు ఏజెన్సీ పేర్కొంది.
హైకోర్టు ఆదేశం మేరకు, షేక్ షాజహాన్ అతని సహచరులు సందేశ్‌ఖాలీలో పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా ఘటనలపై కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఫెడరల్ ఏజెన్సీ గురువారం భూకబ్జాలు, లైంగిక వేధింపులపై తన మొదటి కేసును నమోదు చేసింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..