భానుడి భగభగలు దేశ వ్యాప్తంగా అమాంతం పెరిగిపోయాయి. ఉదయం 9 దాటిందంటే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి. తాజాగా ఓ గర్భిణి ఎండలో ఏకంగా 7 కిలోమీటర్లు నడిచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తుండగా వడదెబ్బకు గురై మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో మే 15న సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్( 21) అనే గర్భిణి జనరల్ చెకప్‌కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయల్దేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుని, అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరింది. వైద్య చేయించుకున్న తర్వాత సోనాలి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరింది. ఈ క్రమంలో హైవేపై దిగింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉండటంతో మెల్లగా కాలి నడకన నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది.
అయితే ఇంటికి చేరుకున్న కాసేపటికే వడదెబ్బ కారణంగా సోనాలి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సోనాలి మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. తీవ్రమైన ఎండలో 7 కి.మీ నడవడం వల్ల ఆమె వడదెబ్బకు గురైందని, బాధితురాలికి రక్త హీనత కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి