Home Andhrapradesh Samalkota Fire Accident : బాణాసంచా కేంద్రంలో పేలుడు.. 20 మంది దుర్మరణం!

Samalkota Fire Accident : బాణాసంచా కేంద్రంలో పేలుడు.. 20 మంది దుర్మరణం!

0
14
Samalkota Fire Accident
Spread the love
  • సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో విషాదం
  • 5 కిలోమీటర్ల మేర దద్దరిల్లిన భూమి.. చెల్లాచెదురుగా శరీర భాగాలు
  • మృతుల్లో అధికంగా మహిళలే.. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది


కాకినాడ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం (Samalkota Fire Accident) చోటుచేసుకుంది. వేట్లపాలెం (Vetlapalem) పరిధిలోని గోదావరి కెనాల్ పక్కన ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు మహిళలే ఉండటం గమనార్హం.

యుద్ధ క్షేత్రాన్ని తలపించిన ఘటనాస్థలి

మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. పేలుడు ధాటికి మృతదేహాలు తునకలై గాలిలోకి ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం, కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడం చూసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

5 కి.మీ మేర ప్రకంపనలు: పేలుడు (Kakinada Fireworks Explosion) ధాటికి ఐదు కిలోమీటర్ల మేర శబ్దాలు వినిపించాయి. పక్క గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల స్లాబ్‌కు పగుళ్లు రావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. పేలుడు అనంతరం భారీగా మంటలు ఎగసిపడటంతో ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలముకుంది.

సహాయక చర్యలు – బాధితుల వివరాలు

సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Samalkota Fire Accident : గుర్తించిన మృతుల వివరాలు:

పోలీసులు ఇప్పటివరకు 11 మంది బాధితులను గుర్తించారు. వారు: అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నాని. మరికొందరిని గుర్తించాల్సి ఉంది.

నిబంధనల ఉల్లంఘనే కారణమా?

అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈ పరిశ్రమలో, అనుమతించిన పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకుని ఈ విస్ఫోటనం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనాస్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.


🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here