Rythu Bharosa | రైతు భరోసాపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌలి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వార్షిక బ్జడెట్ ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాలు ఏంటి.. అందుకు గల కారణాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఎంత? రాబోయే సీజన్‌కు పంటల బీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలను డిప్యూటీ సీఎం సమావేశంలో తెలుసుకున్నారు.
రైతు భరోసా పెట్టుబడి సాయం పెంపు..
ప్రతిపాదిత ‘రైతు భరోసా’ పథకం (Rythu Bharosa Scheme) పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రైతులతో ముచ్చటించారు. 110 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ ఇంటరాక్షన్ జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రైతుబంధు పథకం స్థానంలో ‘రైతు భరోసా’ పేరుతో ఎకరాకు ఏటా రూ.5వేలు పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.
గత ప్రభుత్వం సాగు చేయని భూములకు ‘రైతు బంధు కింద 12 విడతలుగా సుమారు రూ.25,670 కోట్లను పంపిణీ చేసి, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు. చిన్న, కౌలు రైతులను ఆదుకోవడంలో పథకం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. “రైతు బంధు 68 శాతం చిన్న రైతులకు చేరుకోలేదని, కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది” అని తుమ్మల అన్నారు.
తాము తీసుకొస్తున్న ‘రైతు భరోసా’ ఈ సమస్యలను పరిష్కరిస్తుంది. మెరుగైన నిబంధనలతో రైతులకు సహాయాన్ని అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలను ఇంకా ఖరారు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. పథకం అమలు చేయడానికి ముందు శాసనసభ సభ్యులు రైతుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని, వివిధ జిల్లాలకు చెందిన రైతులు సంప్రదించడం అభినందనీయమని, ఈ పథకం సాగుదారులు, సాగులో ఉన్న భూమి రెండింటినీ స్పష్టమైన గరిష్ట పరిమితితో కవర్ చేయాలని అభ్యర్థించారు.
సేకరించిన సూచనల ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి నాగేశ్వరరావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..