Elevated Corridor Project | హైదరాబాద్ ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట వరకు ఉన్న మార్గాల్లో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై కదలిక వచ్చింది. ఈ కారిడార్లకు సంబంధించి ఆదాయ, వ్యయ అంచనాలు, అలాగే వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు పాలనపరమైన అనుమతులిచ్చింది. ఆర్మీ అధికారులతో కలిసి భూసేకరణ పనులను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు ఓ కన్సల్టెన్సీని హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నియమాకం చేసే కన్సల్టెన్సీ నివేదిక కీలకమవుతుంది.
అండర్ గ్రౌండ్ టన్నెల్
హైదరాబాద్ – కరీంనగర్ మార్గంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట వరకు వెస్ట్ మారేడుపల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాళ్, హకీంపేట్, తుంకుంట మీదుగా ఆరు వరుసలతో 18.100 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 192.20 ఎకరాల భూమి అవసరం ఉంది. ఇందులో 113.48 ఎకరాల వరకు రక్షణ శాఖ భూములు కాగా, 83.72 ఎకరాలు ప్రైవేటు భూములు ఉన్నాయి. అలాగే ఈ కారిడార్ నిర్మాణానికి రూ.2,232 కోట్లతో ప్రాజెక్టును అంచనా వేసింది అంతేకుండా దీనికి పాలనపరమైన అనుమతులు కూడా ఇచ్చారు.
హైదరాబాద్ నాగ్ పూర్ మార్గంలో..
Elevated Corridor Project : మరోవైపు జాతీయ రహదారి 44లోని హైదరాబాద్-నాగ్‌పూర్ మార్గంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ నుంచి కొంపల్లి అవతల ఉన్న డెయిరీ ఫామ్ రోడ్ వరకు ఆరు లైన్లు విస్తరించనుండగా ఆ మార్గంలో ముఖ్యమైన ప్రాంతాలైన తార్‌బండ్ జంక్షన్, బోయినిపల్లి జంక్షన్‌లతో కలిపి 5.320 కిలో మీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రూ.1,580 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పాలనపరమైన అనుమతులు ఇచ్చింది. ఇందులో 600 మీటర్ల వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. అయితే ప్యారడైజ్ నుంచి కొంపల్లి తర్వాత డెయిరీ ఫామ్ వరకు 18.35 కిలోమీటర్లలో ఇప్పటికే సుచిత్ర జంక్షన్, పేట్ బషీర్‌బాద్, కొంపల్లి జంక్షన్లలో దాదాపు ఐదు కిలోమీటర్లకు పైగా ప్లైఓవర్ల నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టింది. మిగతా మార్గాన్ని పూర్తి చేసేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. 5.320 కిమీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 73.16ఎకరాల భూమి అవసరం ఉండగా, 55.85ఎకరాలను రక్షణ శాఖ నుంచి 8.41ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి వస్తోంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..