Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందారని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో తొలిదశ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతున్న క్రమంలోనే ఇంతటి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే బస్తర్ రీజియన్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నక్సల్స్ ప్రభావిత బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అనధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఖ్య మరింత పెరుగొచ్చని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదేనని పోలీసులు చెబుతున్నారు.
భారీగా ఆయుధాలు స్వాధీనం
కాగా మృతుల్లో మావోయిస్టు అగ్ర నేత భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు చెందిన శంకర్‌రావు కూడా ఉన్నారని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ ఘటన స్థలం నుంచి భారీగా ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్ రైఫిళ్లు, కార్బైన్, 303 రైపిల్స్, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్ ను నక్సలిజంపై సర్జికల్ స్రైక్‌గా ఛత్తీస్‌గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు.
ఎస్పీ ఇంద్ర కల్యాణ్ ఎలీషా నాయకత్వం
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు ప్లీనరీకి రెడీ అవుతున్నట్లు పోలీస్‌లకు సమాచారం అందింది. సీపీఐ(మావోయిస్టు) బస్తర్ డివిజన్ నేతలు శంకర్, లలిత, రాజు తదితరులు వస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), జిల్లా రిజర్వ్ గార్డు (డీఆర్‌జీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ ప్రారంభించారు. ఇదే సమయంలో బీనగుండా-కొరగుట్ట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ మావోయిస్టులు కనిపించగా జవాన్లపైకి ఒక్కసారిగా కాల్పులు చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై ఎదురుదాడికి దిగారు. భద్రతా బలగాలు ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరపడంతో కింద ఉన్న మావోయిస్టులు తప్పించుకొనేందుకు అవకాశం లేకుండా పోయిందని సమాచారం. ఈ భారీ ఎన్‌కౌంటర్‌కు కాంకేర్ జిల్లా ఎస్పీ ఇంద్ర కల్యాణ్ ఎలీషా నాయకత్వం వహించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మావోయిస్టులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారనే విశ్వనీయ సమాచారం భద్రతా దళాలకు నిఘా వర్గాలు అందించాయని ఎస్పీ తెలిపారు.
అతిపెద్ద ఎన్‌కౌంటర్ ఇదే!
గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదని తెలుస్తోంది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh Encounter) లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. అదే సంవత్సరం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్-కస్నాసుర్ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు చనిపోయారు. 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016 లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్ బలగాలు చంపేశాయి..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..