Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..
Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 2) సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ఏ భూమినైనా క్లెయిమ్ చేసే అపరిమితమైన అధికారాల కారణంగా వక్ఫ్ బోర్డు వేల కోట్ల విలువైన 9.4 లక్షల ఎకరాలను తన గొడుగు కిందకు తెచ్చుకుంది. కాంగ్రెస్ హయాంలో UPA-2 వక్ఫ్ చట్టం ప్రకారం అదనపు అధికారాలను కట్టబెట్టింది. తద్వారా వక్ఫ్ బోర్డు నుంచి నుంచి భూమిని తిరిగి పొందడం ఎన్నటికీ అసాధ్యంగా మారింది. ప్రభుత్వ భూములపై క్లెయిమ్ చేసే కేసులు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఇలాంటి వివాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఆగస్టు 5న బిల్లును ప్రవేశపెట్టవచ్చని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
మొత్తం 40 సవరణలు..!
మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం.. ఆగస్టు 2వ తేదీన వక్ఫ్ చట్టానికి దాదాపు 40 సవరణలకు ఆమోదం తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత NDA ప్రభుత్వం 5 ఆగస్టు 2024న పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టవచ్చని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశ చరిత్రలో ఆగస్టు 5వ తేదీకి మోదీ ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. 5 ఆగస్టు 2019న పార్లమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అంతేకాకుండా, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజను కూడా 5 ఆగస్టు 2020న ప్రధాని మోదీ చేశారు.
నివేదికల ప్రకారం, ప్రతిపాదిత సవరణలలో వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై చేసిన లేదా చేయవలసిన క్లెయిమ్‌లను తప్పనిసరిగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల వివాదాస్పద ఆస్తులకు కూడా వెరిఫికేషన్ తప్పనిసరి. వివిధ రాష్ట్రాల్లోని భూములు, ఇతర ఆస్తులపై వక్ఫ్ బోర్డులు చేసే క్లెయిమ్‌లను అరికట్టడానికి వివాదాలను నివారించడానికి ఇది సహాయపడుతుంది.
9.4 లక్షల ఎకరాల ఆస్తి
Waqf Board Properties : భారతదేశంలో వక్ఫ్ బోర్డు లకు ఉన్న అధికారాలు ఒమన్, సౌదీ అరేబియా, ఇతర ఇస్లామిక్ దేశాలలో కూడా లేవు. వివిధ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుల కింద దాదాపు 8.7 లక్షల ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల కింద మొత్తం భూమి దాదాపు 9.4 లక్షల ఎకరాలు ఉంది. గతంలో రాష్ట్రాలలోని వక్ఫ్ బోర్డుల అధికార దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వక్ఫ్ ఆస్తులను జిల్లా మేజిస్ట్రేట్‌లు పర్యవేక్షించే అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏదైనా అప్పీల్ కోర్టులకు మాత్రమే చేయబడుతుంది. ఈ అప్పీళ్లు కూడా కాలపరిమితితో ఉండవు. కోర్టు నిర్ణయమే అంతిమమైనదిగా పరిగణించాల్సి ఉంటుంది. PIL ద్వారా మినహా హైకోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు.
కాంగ్రెస్ హయాంలో వక్ఫ్‌కు అపరిమిత హక్కులు
జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో వక్ఫ్ చట్టం 1954లో ఉనికిలోకి వచ్చింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు వక్ఫ్ బోర్డులకు అధికారాలు కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. అప్పటి నుంచి ఇది చాలాసార్లు సవరించారు. 2012లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రాథమిక వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు ఇచ్చింది.
ఇక వక్ఫ్ అనే పదం అరబిక్ నుంచి వచ్చింది. దీని అర్థం ప్రజా సంక్షేమం కోసం అంకితమైన ఆస్తి . ఇస్లాంలో, వక్ఫ్ అంటే ఇస్లాంను విశ్వసించే వ్యక్తులు జకాత్ రూపంలో విరాళంగా ఇచ్చే ఆస్తి. ఈ సంపద ముస్లింల ప్రయోజనాల కోసం లేదా ఇస్లాం వ్యాప్తికి మాత్రమే ఉపయోగపడుతుంది.
2014లో ఎన్డీయే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ 123 ప్రధాన ఆస్తులను వక్ఫ్ బోర్డుకు బదిలీ చేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఆస్తులను తిరిగి పొందేందుకు దాదాపు పదేళ్ల సమయం పట్టింది. ఇంకా, సెప్టెంబరు 2022లో వక్ఫ్ బోర్డు మొత్తం గ్రామాన్ని 1100 సంవత్సరాల పురాతన దేవాలయంతో సహా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంది. రాజగోపాల్ అనే వ్యక్తి తన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాజగోపాల్ తన భూమిని విక్రయించడానికి రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినపుడు అతను విక్రయించాలనుకుంటున్న భూమి అతడిది కాదని, ఆ భూమిని వక్ఫ్‌గా మార్చారని, ఇప్పుడు దాని యజమాని వక్ఫ్ బోర్డు అని తెలుసుకున్నాడు. అది మాత్రమే కాదు.. గ్రామస్థులందరి భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..”