మధ్యప్రదేశ్ లో ఘోరం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధుల్లో నడుస్తూ.. సహాయం కోరిన బాధితురాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
ujjain incident : మధ్యప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.. 12 ఏళ్ల బాలిక చిరిగిన దుస్తులతో వీధిలో నడుచుకుంటూ వస్తున్న షాకింగ్ వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బద్ నగర్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. రక్తపు మరకలతో తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాలికకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు చలించిపోయి ఎంతటి ఘోరం అంటూ.. కన్నీరు పెడుతున్నారు.
ఎన్డీటీవీ షేర్ చేసిన క్లిప్ లో, 12ఏళ్ల బాలిక అత్యాచారం తర్వాత రక్తస్రావం అవుతూ సహాయం కోసం ఇంటింటికీ వెళుతున్నట్లు కనిపిస్తుంది. అత్యంత దయనీయ పరిస్థితి చూసి కూడా అక్కడున్న ప్రజలు చూస్తూ ఉండిపోయారు కానీ బాధితురాలికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వీడియోలో ఆమె సహాయం కోరినప్పుడు ఒక వ్యక్తి ఆమెను తరిమికొట్టడం.. గుండెను దహించి వేస్తోంది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్ నగర్ రహదారి వద్ద ఉన్న CCTV కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు యావత్ సమాజాన్ని షాక్ కు గురిచేశాయి.
చిరిగిన బట్టలతో వీధుల్లో తిరుగుతున్న బాలిక చివరికి ఒక ఆశ్రమానికి చేరుకుంది. ఆశ్రమంలో ఉన్న ఒక పూజారి, సదరు బాలిక లైంగిక హింసకు గురైనట్లు తెలుసుకొని ఆమెను వెంటనే టవల్ లో చుట్టి, జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
అయితే వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించినట్లు నివేదికలో పేర్కొంది.
గాయాలు తీవ్రంగా ఉండడంతో బాలికను ఇండోర్ కు తరలించారు. బాధితురాలికి రక్తదానం చేసేందుకు పోలీసు సిబ్బంది ముందుకు వచ్చారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన కు పాల్పడిన గుర్తుతెలియని నిందితులపై అత్యాచారం కేసుతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ దారుణ ఘటనపై ఉజ్జయిని పోలీసు చీఫ్ సచిన్ శర్మ మాట్లాడుతూ.. “వైద్య పరీక్షలో అత్యాచారం జరిగినట్లు తేలింది. మేము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం.. దీనిని నిశితంగా పరిశీలిస్తున్నాము. ఏదైనా సమాచారం అందితే పోలీసులకు తెలియజేయాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని తెలిాపరు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
అయితే అత్యాచారానికి గురైన బాలిక వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కి చెందినదని శర్మ పేర్కొన్నారు. “అమ్మాయి ఎక్కడి నుండి వచ్చిందో మాకు ఖచ్చితంగా చెప్పలేకపోయింది. కానీ ఆమె ఉచ్ఛారణ ప్రకారం ఆమె ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్(Prayagraj ) కి చెందినదని తెలుస్తోందని పేర్కొన్నారు.