Kallakurichi Hooch Tragedy | కరుణాపురం, కళ్లకురిచిలో కల్తీ మద్యం ఘటనలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఉదయం వరకు మరో పది మంది ప్రాణాలు కోల్పోవడంతో కళ్లకురిచి దుర్ఘటనలో మృతుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం, మరో 115 మంది కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల- ఆసుపత్రితో పాటు సేలం, విల్లుపురం, పుదుచ్చేరిలోని జిప్మర్‌లోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గురువారం మంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధిత కుటుంబాలను పరామర్శించి, చెక్కులను అందజేసి, కల్తీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నలుగురి అరెస్టు
ఈ దుర్ఘటనపై విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ బి. గోకుల్‌దాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని, కల్తీ మద్యం తయారీకి వినియోగించే మిథనాల్‌ను సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మిథనాల్ మూలంపై దర్యాప్తు చేయాలని సిబిసిఐడి (క్రైమ్ బ్రాంచ్-సిఐడి)ని ఆదేశించినట్లు సీఎం ప్రకటించారు. అదనంగా, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు మరియు జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేశారు.
ప్రతిపక్షాల ఆందోళన
కాగా, కల్తీ మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి కె. పళనిస్వామి డిమాండ్ చేశారు. కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం విక్రయాలపై అధికారులు కండ్లు మూసుకున్నారని పళని స్వామి ఆరోపించారు. కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ఎం.సెంథిల్‌కుమార్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని, అసెంబ్లీలో కూడా లేవనెత్తారని, అయినా డీఎంకే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
సీబీఐ విచారణ జరిపించాలి : బీజేపీ
Kallakurichi hooch tragedy : తమిళనాడులో కల్తీ మద్యం తయారీ, విక్రయాలు అధికార డీఎంకే కార్యకర్తల ఆదేశానుసారం జరిగాయని ఆరోపిస్తూ.. కళ్లకురిచి హూచ్ దుర్ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర విభాగం గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరింది. రాష్ట్రంలోని తాజా పరిణామంపై అమిత్ షా కు వివరించిన బిజెపి చీఫ్ కె అన్నామలై.. కళ్లకురిచి జిల్లాలోని కరుణాపురంలో నకిలీ మద్యం అనేక మంది “అమూల్యమైన” ప్రాణాలను బలిగొందని, 90 మందికి పైగా ప్రజలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు’ అని అన్నామలై హోంమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
2023 మేలో ఇలాగే మరక్కనం (విల్లుపురం జిల్లా), చెంగల్పట్టు జిల్లాలో 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగింది. డీఎంకే అసమర్థ పాలన కారణంగా గత రెండేళ్లలో తమిళనాడు 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..