CM Revanth Reddy | తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామం, తండాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. శిథిలమైన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2వేల కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. విద్యార్థులు రావడం లేదనే సాకుతో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదని, మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే అలాంటి దుస్థితి వచ్చిందని తెలిపారు.
పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ (vandemataram foundation) ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సోమవారం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ సేవలు విలువైనవని కొనియాడారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వం అధికారికంగా అందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి సర్కారు పాఠశాల విద్యార్థులు రాణించడం ప్రభుత్వానికి గర్వకారణమని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని, గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్లు ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్ విధానం కారణంగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని రేవంత్ పేర్కొన్నారు. ఎవరైనా సలహాలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..