Iran War Live Updates | ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం (Iran US Ceasefire) కుదిరినప్పటికీ, ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. ఈ ఒప్పందం కేవలం తాత్కాలికమేనని, ఇరాన్ నిబంధనలు అతిక్రమిస్తే ఊహించని పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఆయన వరుస పోస్టులతో టెహ్రాన్‌కు అల్టిమేటం జారీ చేశారు.
సైన్యం వెనక్కి తగ్గదు: ట్రంప్ స్పష్టీకరణ
ఒప్పందం కుదిరింది కదా అని అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోదని ట్రంప్ స్పష్టం చేశారు. “అమెరికా నౌకలు, విమానాలు మరియు సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టుపక్కలే మోహరించి ఉంటారు.
కుదిరిన ‘నిజమైన ఒప్పందం’ పూర్తిగా అమలయ్యే వరకు అదనపు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో మా సైన్యం సిద్ధంగా ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే, బలహీనపడిన శత్రువును ప్రాణాంతకంగా ఎదుర్కోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
Iran War : ‘షూటింగ్ స్టార్ట్స్’.. మునుపెన్నడూ చూడని రీతిలో!
ఒప్పందం నుండి ఇరాన్ ఏమాత్రం పక్కకు తప్పుకున్నా సైనిక చర్య తప్పదని ట్రంప్ ఘాటుగా స్పందించారు. “ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒప్పందం అమలు కాకపోతే, అప్పుడు యుద్ధం (Shooting) మళ్ళీ మొదలవుతుంది. అది మునుపెన్నడూ ఎవరూ చూడనంత పెద్దదిగా, బలంగా మరియు మెరుగ్గా ఉంటుంది” అని హెచ్చరించారు. తన తదుపరి విజయయాత్ర కోసం అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని, “అమెరికా తిరిగి వచ్చింది” (America is Back) అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అణు కార్యక్రమం, హర్మూజ్ జలసంధి
అమెరికా దీర్ఘకాలంగా కోరుతున్న ప్రధాన డిమాండ్లపై ట్రంప్ నొక్కి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz,): ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి నిరంతరాయంగా, సురక్షితంగా తెరిచి ఉండాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఒప్పందం కుదిరిందని, ఇందులో ఎలాంటి బూటకపు మాటలకు తావులేదని ఆయన అన్నారు.
అస్పష్టంగానే ఇరాన్ అణు స్థితి
అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదికల ప్రకారం.. సుసంపన్న యురేనియం వంటి కీలక అంశాలపై ఇరాన్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా సూచించినప్పటికీ, ఇరాన్ అణు కార్యక్రమం యొక్క ప్రస్తుత స్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరోసారి ఆందోళనను పెంచాయి.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳










