దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అనతికాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మధ్యతరగతి ప్రయాణికుల కోసం వందేభారత్ సాధారణ్ పేరుతో స్లీపర్ కోచ్ లతో రైళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సిఆర్(Delhi-NCR)లో భారతదేశపు మొట్టమొదటి అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్ (RAPIDX Train)ను ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లోనే పట్టాలెక్కనున్న ఈ ట్రైన్‌ను పూర్తిగా మహిళలు నడపనుండటం విశేషం.
పూర్తిగా మహిళా పైలట్లే..
దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దేశ రాజధానిలో రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడం, రోడ్డుపై వాహనాల సంఖ్యను తగ్గించడం, గ్రీన్ ఎనర్జీని వినియోగించడం ద్వారా డీ కార్బనైజేషన్‌కు సహకరించడమే లక్ష్యంగా ఈ రైలును తీసుకొస్తున్నారు. మొదటిగా ఈ రైళ్లు ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్(Delhi-Ghaziabad-Meerut)లో అందుబాటులోకి వస్తున్నాయి. అదే గనుక జరిగితే ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది.
ఈ ట్రైన్ కారిడార్ నిర్మాణ పనులు నాలుగు నెలల క్రితమే పూర్తయ్యాయి. ఢిల్లీ, మీరట్‌లను కలిపే ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC ) పర్యవేక్షిస్తుంది. ఈ పేరులోని X నెక్స్‌ట్ జనరేషన్ టెక్నాలజీ, న్యూ ఏజ్ మొబిలిటీ సొల్యూషన్స్, వేగం, పురోగతి, యువత, ఆశా వాదం, శక్తిని సూచిస్తుందని NCRTC పేర్కొంది. అలాగే ప్రయాణికుల కోసం‘RAPIDX Connect’ అనే మొబైల్ యాప్ ను కూడా ఆవిష్కరించాలని భావిస్తోంది.
అత్యాధునిక సౌకర్యాలతో RAPIDX Train..
ఇక ఈ రైలులో సౌకర్యాల విషయానికొస్తే.. RAPIDX ట్రైన్స్ ఆరు కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో సహా అనేక అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ కోచ్‌లలో నాలుగు స్టాండర్డ్ కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రీమియం కోచ్‌తో పాటు రిక్లైనింగ్ సీట్లు, ఎక్స్‌ట్రా లెగ్ రూమ్, ప్రత్యేక లాంజ్ అందుబాటులో ఉంటాయి. మెట్రో రైలు గంటకు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ర్యాపిడ్ఎక్స్ రైలు ఏకంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ర్యాపిడ్ఎక్స్ రైలులో అడ్జస్టబుల్ చైర్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఏసీ సిస్టం, ఆటోమేటిక్ డోర్ కంట్రోల్ సిస్టమ్.. లగేజ్ స్టోరేజ్ స్పేస్, పెద్ద విండోలతో ఈ రైలు అత్యాధునికంగా కనిపిస్తుంది. ఈ రైళ్లలో ఢిల్లీ మెట్రో మాదిరిగానే మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ కోచ్ కూడా ఉంది.
ప్రతీ సీటు వద్ద ఛార్జింగ్ పాయింట్లు, ఆన్‌బోర్డ్ వైఫై , డిస్‌ప్లే సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్, డైనమిక్ రూట్ మ్యాప్ డిస్‌ప్లేలు ఉంటాయి. అలాగే వీల్‌చైర్‌ల కోసం నిర్దేశించిన ప్రాంతాలు, అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్‌కామ్ ద్వారా ట్రైన్ డ్రైవర్‌తో నేరుగా కమ్యూనికేట్ చేసే ఎమర్జెన్సీ అలారం సిస్టం కూడా ఈ ట్రైన్‌లో పొందుపరిచారు. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఈ రూట్‌లో నిత్యం సంచరించే లక్షలాది వాహనాలను సంఖ్య కొంతమేరకైనా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.