తెలంగాణ కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు
హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు(Vande Bharat Express)ను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి తరచుగా బెంగళూరుకు ప్రయాణించే వారి కోసం కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య కొత్తగా వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) రంగం సిద్ధం చేస్తోంది .
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ నెలాఖరులో వర్చువల్ మోడ్‌లో తాజా VB ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే SCR అధికారులు ఇంకా లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా వివరాలను వెల్లడించలేదు.
కాగా కాచిగూడ – యశ్వంత్‌పూర్ మధ్య VB ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రవేశపెట్టబడిన మూడవ రైలు అవుతుంది. గతంలో ప్రారంభించిన మొదటి రెండు VB ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతికి ప్రవేశపెట్టారు..
కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం, హైదరాబాద్(Hyderabad) నుంచి బెంగళూరుకు సాధారణ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించడానికి సుమారు 11 గంటలు పడుతుంది. అయితే VB ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన తర్వాత సమయం ఇప్పుడు ఎనిమిదిన్నర గంటలకు తగ్గిపోతుంది.
ఈ రైలు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.