
Six Years Of Pulwama attack : ఫిబ్రవరి 14, 2019న, జమ్మూ-శ్రీనగర్ (Jammu to Srinagar Balakot) జాతీయ రహదారిపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( CRPF ) కాన్వాయ్ కదులుతుండగా, పుల్వామా (Pulwama Attack ) వద్ద ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని జవాన్ల బస్సులలో ఒకదానిపైకి ఢీకొట్టాడు. అవంతిపోరాలోని గోరిపోరాలో జరిగిన విధ్వంసకర దాడిలో 40 మంది CRPF సిబ్బంది వీర మరణం పొందారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు యావత్ దేశం సంతాపం తెలిపింది, అయితే దెబ్బకు దెబ్బ తీయాలని సగటు ప్రతీ బారతీయుడు కోరుకున్నారు.
Pulwama attack : బాలాకోట్ వైమానిక దాడితో ప్రతికారం..
2019 Pulwama attack Black Day : పుల్వామా దాడి జరిగిన పన్నెండు రోజుల తర్వాత , భారతదేశం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై ప్రతీకార వైమానిక దాడి ప్రారంభించింది. ఫిబ్రవరి 25 రాత్రి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన భీకర దాడులు చేసింది. దాదాపు 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు, జైష్-ఎ-మొహమ్మద్ శిక్షణ శిబిరాలపై దాదాపు 1,000 కిలోల బాంబులను వేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 1971 తర్వాత మొదటిసారి భారత వైమానిక దళం ఎల్‌ఓసిని దాటి పాకిస్తాన్ భూభాగంలోకి 65 కిలోమీటర్ల లోతులోకి చొచ్చుకుపోయి బాలాకోట్ ప్రాంతంలోని జైష్ శిబిరాన్ని నేలమట్టం చేసింది.
పాకిస్తాన్ కంట పడకుండా ఈ మిషన్‌ను అత్యంత రహస్యంగా పకడ్బందీగా అమలు చేశారు. మెరుపు వేగంతో అత్యంత చాకచక్యంగా చేసిన ఈ బాలకోట్ వైమానిక దాడి చరిత్రలో నిలిచిపోయింది. మన సైన్యం ధైర్యసాహసాలకు ప్రతీకగా గుర్తిండిపోతుంది.
వింగ్ కమాండర్ అభినందన్: ధైర్యానికి చిహ్నం
బాలాకోట్ ఆపరేషన్ సమయంలో, భారత – పాకిస్తాన్ జెట్ల మధ్య వైమానిక డాగ్‌ఫైట్ జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 బైసన్ పాకిస్తానీ ఎఫ్ -16 ను విజయవంతంగా కూల్చివేసింది, కానీ ఇదే సమయంలో మిగ్ -21 సరిహద్దుకు అవతలి వైపు కూలిపోయింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్తాన్ సైన్యం బందీగా పట్టుకుంది.
పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అభినందన్ అద్భుతమైన స్థిరచిత్తాన్ని ప్రదర్శించాడు. భారతదేశం నుంచి దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా, అతను మార్చి 1, 2019న విడుదలయ్యాడు. అతని ధైర్యసాహసాలకు గాను, అతనికి ప్రతిష్టాత్మకమైన వీర్ చక్ర లభించింది. ఆరు సంవత్సరాల తరువాత, పుల్వామా దాడి భారత సాయుధ దళాల త్యాగాలకు ఒక స్పష్టమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.