vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..
వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు ఇవే..
vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్ రైళ్లుగా పేరుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే.. హైస్పీడ్ తో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు లేవు. అందుకే రాత్రి ప్రయాణం ఇందులో వీలు లేదు..
ఈ క్రమంలోనే సాధారణ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తీసుకొస్తోంది భారతీయ రైల్వే. స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే కార్మికులను దృష్టిలో ఉంచుకుని వీటిని తయారుచేశారు.
సాధారణ్ లో సౌకర్యాలు ఏమున్నాయి.?
కాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే.. వందే ‘సాధారణ్ ‘(Vande Sadharan) రైళ్లు కాస్త భిన్నంగా ఉంటాయి. వందే సాధారణ్ రైళ్లు దాదాపుగా 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా రూపొందించారు. ఈ రైళ్లలో ఇంటర్ సిటీ ప్రయాణంతో పాటు పగలు రాత్రి వేళల్లో కూడా ప్రయాణాలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రత్యేక సందర్భాల్లో తప్ప రాత్రి వేళల్లో సర్వీస్ ను అందించడం లేదు.
ఇక వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 22 కోచ్ లు, 2 ఇంజన్లు ఉంటాయి. అలాగే 12 అన్ రిజర్వ్ డ్ స్లీపర్ కోచ్ లతో పాటు 8 జనరల్ కోచ్ లు ఉండడం విశేషం. వీటితో పాటు 2 లగేజ్ కోచ్ లు ఉంటాయి. అంతేకాకుండా ఈ రైల్లో 1,800 మంది ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుంటుంది.
వందే సాధారణ్ రైలు గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఇంజిన్ ను రూపొందించారు అయినప్పటికీ భద్రతా కారణాల వల్ల ఈ వేగాన్ని గంటకు 110 కిలోమీటర్లకే పరిమితం చేసే చాన్స్ ఉంది. అయితే వందే సాధారణ్ రైళ్లు నాన్-ఏసీ రైలు కాగా ఇందులో బయో-వాక్యూమ్ టాయిలెట్లు, LED లైట్లు, ఫ్యాన్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పోర్టులు వంటి సౌకర్యాలను పొందుపరిచారు.
విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి
వందే సాధారణ్ రైళ్లలో వందే భారత్ లో ఉన్నట్లుగా ఆటోమేటిక్ డోర్లు, ప్యాంట్రీ సిస్టమ్ ఉండవని తెలుస్తోంది. ఇటీవల ఆగష్టు 29 న కొత్త వందే సాధారణ్ రైలు ముంబైలోని వాడి బందర్ యార్డ్ కు చేరుకోగా నవంబరు 8న అహ్మదాబాద్, ముంబయి మధ్య ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తిచేశారు.
కాగా వందే సాధారణ్ రైలు ముంబయి – అహ్మదాబాద్ రూట్ లో కాకుండా, హైదరాబాద్ – న్యూఢిల్లీ, ముంబయి – న్యూఢిల్లీ, పాట్నా – న్యూఢిల్లీ, హౌరా – న్యూఢిల్లీ, ఎర్నాకులం – గౌహతి మార్గాల్లో ఈ రైలు నడిచే అవకాశముంది. నివేదికల ప్రకారం వందే భారత్ సాధారణ్ రైళ్లకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా పిలుస్తున్నారు.
వందే సాధారణ్ రైళ్లలో ప్రయాణికులు తక్కువ టికెట్ ఛార్జీలతో వందేభారత్ యాత్రను ఆస్వాదించవచ్చు. కాగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో సాధారణ రైళ్ల కంటే 15 శాతం మాత్రమే ఎక్కువ ఛార్జీలు ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా 30 రూట్లలో వందే సాధారణ్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అందుకోసం చెన్నై కోచ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీలో 400 వందే సాధారణ్ రైళ్లను రెడీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్గాల్లో ఈ రైళ్లు తిరగనున్నాయో రానున్నరోజుల్లో తెలియనుంది. ఇదిలా ఉండగా వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ తోపాటు ‘వందే భారత్ స్లీపర్’ క్లాస్ కోచ్ లతో రైళ్లను సైతం తయారు చేస్తోంది. ఇవి వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 857 బెర్త్లు ఉంటాయి.