తెలంగాణలో ఎన్నికల పండగ వచ్చేసింది. గురువారం జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే.. పలు కారణాల వల్ల కొందరికి ఓటరు స్లిప్ (voter slip) అందకపోవచ్చు. అలాంటి వారు ఆందోళన చెందకుండా కొన్ని పద్ధతులను పాటించి మీ ఓటర్ స్లిప్‌ను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..
ఓటర్ స్లిప్ తో లాభం ఇదే..
మన వద్ద ఓటర్ ఐడీ ఉంటుంది కదా.. మరి, ఈ ఓటరు స్లిప్ ఎందుకు? అనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే.. మనం ఉన్న ఏరియాలో సుమారు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మనం ఓటు వేసేందుకు వీలుంటుంది. ఆ పో లింగ్ కేంద్రం ఏది? ఎక్కడుంది? అనేది మనకు తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన వద్ద ఉండాలి. ఓటు వేయడానికి మనం వెళ్లినప్పుడు.. ఓటరు ఐడీ కార్డు లేదా.. వేరే ఇతర గుర్తింపు కార్డు తో పాటు.. ఈ స్లిప్ తీసుకెళ్తే.. త్వరగా ఓటు వేసేయవచ్చు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
అయితే.. గతంలో ఉన్న ఓటరు స్లిప్‌లకు.. ప్రస్తుతం అందించిన స్లిప్‌లకు చాలా తేడా ఉంది. ఇదివరకు పోల్ చిట్టీలను పార్టీల వారే పంపిణీ చేసేవారు. కానీ ప్రచారం ముగిసిన తర్వాత పోల్ చీటీల పంపిణీ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని గమనించిన ఎన్నికల సంఘం ..దానిని అరికట్టింది. 2018 ఎన్నికల నుంచి పోల్ స్లిప్ లను పంపిణీ చేస్తోంది. గతంలో పోల్ చీటీలో కేవలం ఓటరు ఫొటో, వివరాలు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి ఎన్నికల్లో కొత్త తరహా ఓటర్ స్లిప్పులను రూపొందించారు. పోలింగ్ తేదీ, పోలింగ్ ప్రారంభం, ముగింపు సమయం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, గ్రామం, పోలింగ్ కేంద్రం, టోల్ ఫ్రీ నంబర్ వంటి వివరాలను ముద్రించారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బూత్ స్థాయి అధికారి పేరు, మొబైల్ నంబర్ కూడా ముగ్రించారు. ఓటరు పాటించాల్సిన నిబంధనలను సైతం అందులో పొందుపరిచారు.
voter slip అందకపోతే ఇలా చేయండి:
ఎన్నికల సిబ్బంది నుంచి ఓటర్ స్లిప్ లు అందకపోతే.. ఆన్‌లైన్, మొబైల్ యాప్, హెల్ప్ లైన్ నెంబర్, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వీలు కల్పించింది. ఒకవేళ ఫిజికల్ లేదా డిజిటల్ ఓటర్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి తనిఖీ చేసుకోవచ్చు.
ఎస్‌ఎంఎస్ ద్వారా:
మీ ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ టైప్ చేసి 1950 లేదా 9211728082 అనే నెంబర్‌కు SMS పంపితే పూర్తి వివరాలు వస్తాయి.
టోల్ ఫ్రీ నెంబరు:
టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్ చేసి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ సహాయంతో పోలింగ్ కేంద్రం, బూత్ నంబరు, క్రమసంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నెంబరు 24 గంటల పాటు పనిచేస్తుంది.
ఆన్‌లైన్‌లో:
ఎన్నికల సంఘం https://www. ceotelangana.nic.in/ అనే వెబ్‌సైట్‌లో Search Your Name in Voter List ఆప్షన్‌పై క్లిక్‌చేసి.. ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా పేరును పొందుపరచడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవచ్చు అలాగే డిజిటల్ స్లిప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మెయిల్ ద్వారా..:
ఎన్నికల సంఘానికి ఈ-మెయిల్ (complaints@eci.gov.in) చేసి కూడా.. పోలింగ్ బూత్ వివరాలను పొందవచ్చు.
మొబైల్ యాప్‌తో:
ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐవోఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి ‘ఓటర్ హెల్ప్ లైన్ యాప్’ అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలను అందించడం ద్వారా.. ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవచ్చు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..