వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు
వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.
సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సారించారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 10న ఖరీఫ్ వ్యవసాయ రంగం, నీటిపారుదల ప్రాజెక్టుల తాజా పరిస్థితులపై సమీక్షిస్తారని భావిస్తున్నారు. రుతుపవనాలు వచ్చి వర్షాలు మొదలై, ప్రాజెక్టులలో నీటి మట్టాలు పెరిగితే వ్యవసాయ అవసరాలకు నీటిని విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించవచ్చు. లేకుంటే ఖరీఫ్ నాట్లు మరింత ఆలస్యమయ్యే ప్రమాదముంది.
జలాశయాల్లో తగ్గిపోతున్న నీటి నిల్వలు
కృష్ణా బేసిన్‌లో శ్రీశైలంలో ఎఫ్‌ఆర్‌ఎల్ (పూర్తి రిజర్వాయర్ లెవల్) 885 అడుగులు కాగా, స్థూల నిల్వ సామర్థ్యం (జీఎస్‌సీ) 215 టీఎంసీలు.. అయితే గత శనివారం నీటి మట్టం 808 అడుగులు ఉండగా నిల్వ సామర్థ్యం కేవలం 33 TMC ఉంది. గత ఏడాది 2022
జూలై 1 న నమోదైన 824 అడుగులు ఉండగా.. 44 TMCలు ఉంది. దీన్ని బట్టి గతేడాది కంటే ఈసారి నీటి మట్టం చాలా తక్కువగా ఉంది.
అదేవిధంగా నాగార్జునసాగర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 590 అడుగులు, జీఎస్‌సీ 312 టీఎంసీలు. శనివారం, నీటి మట్టం 519 అడుగులు, నిల్వ 148 TMC ఉంది. ఇక జూలై 1, 2022 నాటికి 531 అడుగులు, 171 TMCఉంది.
గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్ 1091 అడుగులు కాగా, జీఎస్‌సీ 90 టీఎంసీలుగా ఉంది. శనివారం, నీటి మట్టం 1,064 అడుగులు మరియు నిల్వ 20 TMC, ఇక గతేడాది 2022 జూలై 1న 1,066 అడుగులు, 23 TMC కంటే తక్కువగా ఉంది. రాష్ట్రంలోని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి మెరుగ్గా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.