MLC Elections 2024 : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇద్దరు గవర్నర్ కోటా కింద, మరో ఇద్దరు ఎమ్మెల్యేల కోటా కింద నామినేట్ చేయనుండగా జనవరి 29న పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గత గురువారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు వారి పదవులకు రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఎలాంటి పోటీ లేకుండా రెండు స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంది. నామినేషన్ల దాఖలుకు జనవరి 18న చివరి తేదీ.
ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఆమోదం కోసం పార్టీతో చర్చలు జరిపారు.
ఒకప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్.. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు (KCR ) తో కలిసి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ విధానాలతో విభేదించి, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు.
ఏప్రిల్ 2018లో, కోదండరామ్ తన సొంత ప్రాంతీయ రాజకీయ సంస్థ – తెలంగాణ జన సమితి (TJS)ని స్థాపించారు. డిసెంబర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, CPIతో పొత్తుతో పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ ఎన్నికలలో ఎలాంటి ముద్ర వేయలేకపోయింది. ఆ తర్వాత పతనమైపోయింది. అయితే కోదండరామ్ తన వ్యక్తిగత హోదాలో ప్రజల కోసం పోరాటాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్ సేవలను తమ ప్రభుత్వం సముచితంగా వినియోగించుకుంటోందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ఆదివారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మేము అయన్ను ఎమ్మెల్సీ సీటుతో గౌరవిస్తాం. తెలంగాణ అభివృద్ధికి ఆయన అనుభవాన్ని విజ్ఞానాన్ని ఉపయోగిస్తాం అని తెలిపారు. .
గవర్నర్ కోటా కింద రెండో ఎమ్మెల్సీ సీటు కోసం కోదండరామ్‌తో పాటు ప్రముఖ కవి అందెశ్రీ, మైనారిటీ విద్యా సంస్థల ఫెడరేషన్ చైర్మన్ జాఫర్ జావీద్ పేర్లను ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు..
మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నికవడానికి పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ముస్లిం ప్రాతినిధ్యం లేదు కాబట్టి, ఆ పార్టీ నిజామాబాద్ (అర్బన్) నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్‌ను ఎమ్మెల్సీ స్థానానికి నామినేట్ చేసే చాన్స్ ఉంది.
ఎమ్మెల్యే కోటా కింద మరో స్థానానికి ఏఐసీసీ సభ్యుడు ఎస్‌ఏ సంపత్‌కుమార్, మధు యాస్కీగౌడ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, దళిత నేత అద్దంకి దయాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ల పేర్లు పార్టీలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. “ముఖ్యమంత్రి ఈ పేర్లలో కొన్నింటిని హైకమాండ్‌కు అందించారు. ఆమోదం పొందిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో పేర్లను ప్రకటిస్తామని పార్టీ నేతలు తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..