Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..
Mahila Shakti canteens| హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 150 ‘మహిళా శక్తి’ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ అవుట్‌లెట్‌లు తక్కువ ధరతో ఆహారాన్ని అందిస్తాయి. కర్నాటకలో ‘ఇందిరా క్యాంటీన్‌ల’ (Indira canteens) తరహాలో ఇవి ఉంటాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు (స్వయం సహాయక బృందాలు) క్యాంటీన్లు కేటాయించనున్నారు. మహిళా సంఘాల సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 12న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమక్షంలో మహిళా శక్తి పాలసీ పత్రాన్ని విడుదల చేశారు. బ్యాంకుల ద్వారా లక్ష కోట్ల రుణాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్త్రీ నిధి’ కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది స్వయం సహాయక సంఘాల మహిళలను ‘కోటీశ్వరులు’గా తీర్చిదిద్దుతుందని విధాన పత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
కాగా, మహిళా క్యాంటీన్ల (Mahila Shakti canteens ) ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాంటీన్ల నిర్వహణ, క్యాంటీన్‌ల ఏర్పాటుకు అవసరమైన స్థలంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆమె ఆదేశించారు.
కేరళ, పశ్చిమ బెంగాల్‌లో క్యాంటీన్లపై అధ్యయనం చేశామని ఆమె తెలిపారు.. ఈ క్యాంటీన్‌ల నిర్వహణను గ్రామీణ మహిళా సంఘాలకు అప్పగిస్తామని, వారి సభ్యులకు క్యాంటీన్‌ల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. సమావేశంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, హెల్త్ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎండోమెంట్ కమిషనర్ ఎం. హనుమంతరావు, టూరిజం డైరెక్టర్ కె. నిఖిల, టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె. రమేష్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.