Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది. ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా, కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో ఆమెను తీహార్ జైలు(Tihar Jail )కు తరలించారు. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో కవితను మంగళవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే..
కాగా కోర్టులో హాజరుపరిచేముందుక కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తనపై నమోదైన కేసు మనీలాండరింగ్ కేసు కాదని, రాజకీయ లాండరింగ్ కేసు అని ఆమె అన్నారు. అయితే ఈడీ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. కవిత మేనల్లుడి ద్వారా నిధులను మళ్లించారనే ఈడీ దర్యాప్తులో కనుగొన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనతో మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మంగళవారం ఈడీ కస్టడీ ముగియడంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతోమాట్లాడుతూ.. తనపై మోపిన కేసు కేవలం పొలిటికల్ లాండరింగ్ కేసని కవిత అన్నారు. ఒక ఫేక్ కేసు అని, తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని తెలిపారు. ఇదే కేసులో ఒక నిందితుడు బిజెపిలో చేరాడని, రెండో నిందితుడికి బిజెపి నుంచి టికెట్ లభించిందని, మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్లలో రూ.50 కోట్లు ఇచ్చాడని, ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాను కడిగిన ముత్యంలా తిరిగి వస్తానని కవిత పేర్కొన్నారు.
కాగా జ్యుడీషియల్ కస్టడీకి పంపించేలా ఎమ్మెల్సీ కవితను కోర్టును ఆదేశించాలని కోరుతూ ఈడీ రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, ఈడీ కస్టడీ సమయంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశామని, ఆమెను విచారించామని, పలువురు వ్యక్తులు, డిజిటల్ రికార్డులతో ఆమెను విచారించామని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది.
మార్చి 15న అరెస్టు
బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి అదేరోజు అరెస్టు చేశారు. మరుసటి రోజు ఉదయమే ఈడీ కస్టడీకి అప్పగించారు. ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని ఈడీని కవిత కోరారు. కాగా కవిత బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, బెయిల్ పిటిషన్ త్వరగా పరిష్కరిస్తామని ఆదేశాలతో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని గతంలో సూచించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అందరికీ ఒకే విధమైన విధానాన్ని అనుసరించాలని, రాజకీయ నేతలైనందు వల్ల బెయిల్ కోసం నేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అనుమతించలేమని గతంలో కోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో లబ్ధి పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్ర పన్నారని, ఈ ప్రయోజనాలకు బదులుగా ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో ఆమె పాలుపంచుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. చట్ట విరుద్ధంగా అక్రమ సొమ్మును తరలించారనే అభియోగాలను కవిత ఎదుర్కొంటున్నారు.
Delhi Liquor Scam Case : ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో లోపాలను ఎత్తిచూపుతూ ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ 2022 జూలైలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదై అవినీతి వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ఖజానాకు సుమారు రూ.580 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఈడీ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను సీబీఐకి అప్పగించడంతో తర్వాత సిసోడియా అరెస్టు అయ్యారు. హోల్ సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి ఏకంగా 12 శాతం మార్జిన్ నిర్ణయించి అందులో 6 శాతం ముడుపులు చెల్లించేలా కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..