electric double decker buses : హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు సందడి చేస్తున్నాయి. నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావాలని ప్రజల నుండి ఎంతో కాలంగా వస్తున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో గత రెండేళ్ల క్రితం చేసిన అభ్యర్థనపై మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు స్పందించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉందా అని చర్చించారు. అయితే ఈ ట్వీట్‌కు రెండేళ్ల తర్వాత మంగళవారం కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి మొదటి మూడు డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్ పాల్గొన్నారు.
ABB FIA ఫార్ములా E ఛాంపియన్‌షిప్ సందర్భంగా..
ఫిబ్రవరి 11న నగరంలో నిర్వహించనున్న ABB FIA ఫార్ములా E ఛాంపియన్‌షిప్ నాల్గవ రేసు (హైదరాబాద్ E ప్రిక్స్) సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులలో మూడింటిని మంగళవారం ప్రారంభించింది. రేస్ వారంలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ ప్రాంతాలను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ ప్రధానంగా ఈ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతాయి. ఫిబ్రవరి 11 తర్వాత, నగరంలో పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం మూడు డెలివరీ కాగా, మరో మూడు త్వరలో రానున్నాయి. ఈ బస్సులను 20కి విస్తరించాలని HMDA యోచిస్తోంది.
ఒక్కో బస్సు ధర రూ.2.16కోట్లు
డబుల్ డెక్కర్ బస్సు (electric buses ) ధర రూ.2.16 కోట్లు. కాగా, ఈ బస్సుల తయారీ సంస్థతో హెచ్‌ఎండీఏ ఏడేళ్లపాటు యానివల్ మేనేజ్‌మెంట్ (ఏఎంసీ) కుదుర్చుకుంది. డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఈ బస్సుల మొత్తం పొడవు 9.8మీ, ఎత్తు 4.7మీటర్లు ఉంటుంది. ఈ బస్సులను 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.