Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..
Crop Loan | హైదరాబాద్ : కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్ రుణమాఫీ పథకం (Rythu Runa Mafi) ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ పథకంలో భాగంగా ఈరోజు గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు నగదు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చిన విషయం తెలిసిందే.. దానిని అమలు చేసే దిశగా నేడు తొలి అడుగు వేయనుంది. ఈనెల 18న రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆ మొత్తం జమ కానుంది.
రేషన్ కార్డు లేని రైతులకు..
అయితే రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా..70 లక్షల మంది రైతులకు రుణాలు (crop loan waiver) ఉన్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవు. ఈ విషయమై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో గత మంగళవారం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రేషన్ కార్డు కేవలం కుటుంబ వివరాలు తెలుసుకోవడానికి మాత్రమేనని, రుణమాఫీ రైతు పట్టాదారు పాస్ బుక్ ఆధారంగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్‌కార్డులు లేని రైతులకు కూడా న్యాయం చేస్తామని వెల్లడించింది.
రుణమాఫీ అందుకున్న రైతులను రైతు వేదికల వద్దకు ఆహ్వానించి ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో కలిసి వేడుకలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. ఇందుకోసం జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని నియమించనున్నామని, కలెక్టర్లకు ఏమైనా సందేహాలు ఉంటే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కాగా రైతు రుణమాఫీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నామని దీనిపై కలెక్టర్లు శ్రద్ధ చూపాలని ఏ ఒక్క రైతుకూ నష్టం జరగొద్దని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని, సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని ఉన్నతాధికారులకు, బ్యాంకర్లకు సిఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వాటిని వినియోగించవద్దని, గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..