Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..
Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శరవేగంగా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రైల్వేలైన్ ప్రతిపాదనను అటకెక్కించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో రైల్వే శాఖ వేగంగా స్పందించింది. అమరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గతంలో రైల్వే అనేక షరతులు విధించింది. రాష్ట్రం తన వాటాను అందించాలని అలాగే భూసేకరణ ఖర్చులను కూడా భరించాలని సూచించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో అలాంటి షరతులు విధించలేదు. అమరావతి వరకు రైల్వే లైన్‌ను పూర్తిగా తన సొంత నిధులతోనే నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూసేకరణ కోసం ప్రత్యేక ప్రాజెక్టుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కొత్త రైలు మార్గంలో 9 స్టేషన్లు..!
విజయవాడ-హైదరాబాద్ రూట్ లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ లైన్‌లో నంబూరు వరకు రైల్వే లైన్ (Amaravati Railway ) నిర్మించనున్నారు. మొత్తం పొడవు 56.53 కి.మీ ఉంటుంది. అమరావతి రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 56.53 కి.మీ మేర డబుల్ లైను, అమరావతి – పెదకూరపాడు మధ్య 24.5 కి.మీ మేర సింగిల్ లైన్, సత్తెనపల్లి స్టేషన్ – నరసరావుపేట మధ్య 25 కి.మీ సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కి.మీ మేర కొత్త లైనుకు ఆమోదం లభించింది. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనుల్లో వేగం ఊపందుకుంది. అమరావతి రైలు మార్గంలో మొత్తం 9 రైల్వే స్టేషన్లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అవి కింది విధంగా ఉన్నాయి.
- పెద్దాపురం,
- చిన్నారావుపాలెం,
- గొట్టుముక్కల,
- పరిటాల,
- కొత్తపేట,
- వడ్డమాను,
- అమరావతి,
- తాడికొండ,
- కొప్పరవూరు:
మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉంటాయి. వీటిలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పరవూరు ప్రధాన రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ రైల్వే మార్గంలో కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల మేర వంతెన నిర్మించనున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..