Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Zahirabad | తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Zahirabad Industrial Smart City) ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. బుధవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.ఇందులో భాగంగా రూ.2,361 కోట్లతో ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.

ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పారిశ్రామిక ప‌రంగా అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరా సంగం మండలాల్లో ఉన్న‌ 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది.

READ MORE  Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!

మొత్తం రెండు దశల్లో సుమారు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయ‌నున్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్‌ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా 3,245 ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభించ‌నున్నారు. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పూణే – మచిలీపట్నం జాతీయ రహదారికి (NH-65) రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.

మ‌రోవైపు నిజాంపేట్-బీదర్ రాష్ట్ర రహదారి, జహీరాబాద్-బీదర్ రాష్ట్ర రహదారికి సమీపంలోనే ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజనల్ రింగ్‌ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టును నిర్మించ‌నున్నారు. జహీరాబాద్ రైల్వేస్టేషన్‌కు 19 కిలోమీటర్లు, మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ముంబయి జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ 600 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు 620 కి.మీ దూరంలో ఉంది.

READ MORE  Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!

జహీరాబాద్‌లో నిర్మించనున్న ఈ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ మొదటి దశకు కావ‌ల‌సిన 3,245 ఎకరాల స్థలంలో 3,100 ఎక‌రాల‌ భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్ద‌నే ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటో మొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలు ప్ర‌గ‌తిబాట‌ప‌ట్ట‌నున్నాయి. దీంతోపాటుగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ద్వారా.. లక్షా 74వేల మందికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి లభించ‌నుంది. అంతేకాకుండా రూ.10వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టికే పర్యావరణ అనుమతులు వ‌చ్చాయి.

READ MORE  వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *