Varalakshmi vratham : వరాలిచే వరలక్ష్మి.. వ్రత కథ, పూజా ఫలితాలు..
వరలక్ష్మీవ్రతం.. పూజా విధానం
Varalakshmi vratham : శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. ఆగస్టు 25న శుక్రవారం రాష్ట్రమంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.
మహా మాయారూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించే లోక మాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్టఐశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదలను ప్రసాదించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం. పరమ క్తితో పూజించినవారికి, కొలిచిన భక్తులకు కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మిగా కరుణించి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సువాసినులు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు.
వరలక్ష్మీ వ్రత కథ
కైలాస గిరిలో పరమేశ్వరుడు తన అనుచరగణంతో, ముని శ్రేష్టులతో ఉండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. స్వామీ! స్త్రీలు సుఖసౌఖ్యాలు, పుత్ర పౌత్రాదులతో కళకళలాడుతూ ఉండాలంటే ఎలాంటి వ్రతాలను, నోములను ఆచరించాలో సెలవివ్వండి అని కోరింది.
అందుకు పరమేశ్వరుడు సమాధానమిస్తూ స్త్రీలకు సమస్త సుఖాలను ప్రసాదించు వ్రతం వరలక్ష్మీవ్రతము.. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రత కథను శ్రద్ధగా వినాలి. వ్రతాన్ని ఆచరించినవారి మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయి. వరలక్ష్మి కథను తెలియచేస్తానని పరమేశ్వరుడు వ్రతకథను వినిపించాడు..
పూర్వం కుండినం అనే ఒక పట్టణం ఉందేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ మహిళ ఉంది. ఆమె వేకువజామునే లేచి స్నానం ఆచరించి పువ్వులను తెచ్చి భర్త పాదాలకు నమస్కరించి పూజలు చేసేది. అత్తమామలకు తల్లిదండ్రుల మాదిరిగా చూసుకుంటూఉండేది.
గృహ కార్యాలన్నీ స్వయంగా తానే చక్కగా చేసుకొనేది. చుట్టుపక్కల వారు. బంధువులతో చనువుగా కలసిమెలసి ఉండే ది. చారుమతి సద్గుణాలకు వరలక్ష్మీదేవి ప్రసన్నమైంది. ఒకరోజు చారుమతి కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది. చారుమతీ.. నీ సత్ప్రవర్తన, సద్గుణాలకు ప్రసన్నురాలయ్యాను.. నీకు ఒక వరం ఇవ్వాలన్న సంకల్పం నాకు కలిగింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ సమస్త కోరికలు నెరవేరుతాయని పేర్కొంది.
చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మి దేవికి ప్రదక్షిణలు చేసి స్తుతించింది. తెల్లవారిన తర్వాత భర్త, అత్త మామలకు తన కలలో అమ్మవారు చెప్పిన విషయమంతా.. వివరించింది. ఇరుగుపొరుగు స్త్రీలు కూడా ఆ వృత్తాంతాన్ని విని చాలా సంతోషించారు. అందరూ కలిసి వరలక్ష్మీదేవివ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకున్నారు. అందరూ శ్రావణమాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం వేచి చూడ సాగారు. ఆరోజు చారుమతితో సహా ఇతర స్త్రీలందరూ వేకువజాముననే లేచి స్నానమాచరించి కొత్త వస్త్రాలు ధరించారు. చారుమతి వాకిట ముందు గో మయంతో అలికింది. అలికిన చోట బియ్యం పోసి మండపాన్ని ఏర్పాటు చేసింది. ఆ మండపంలోకి వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని పూజించింది.
శ్లోః పద్మప్రియే పద్నిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి
విష్ణుప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయిధత్స్వ
అనే శ్లోకాన్ని పఠిస్తూ షోడశోప చార పూజలు నిర్వహించింది. తొమ్మిది సూతాలు గల తోరాన్ని దక్షిణి హస్తానికి కట్టుకున్నది. వరలక్ష్మీదేవికి వివిధ ఫలభక్ష్య పానీయ, పాయ సాదులను సమర్పించింది. అనంతరం మహిళలందరూ కలిసి వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు.
మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఘల్లుఘల్లుమని శబ్దాలు వినిపించాయి. కిందికి కాళ్ల వైపు చూసుకుంటే గజ్జెలు, రెండో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి హస్తాలు నవ రత్నఖచిత కంకణాలతో ప్రకాశించ సాగాయి. మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే స్త్రీలందరూ సర్వాలం కార భూషణాలతో వెలిగిపోయారు. వారి గృహాలన్నీ సకలసంపదలతో కళకళలాడాయి.
వ్రతం పరి సమాప్తి కాగానే చారుమతి వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తము లకు దక్షిణ తాంబూలాలను అందజేసి ఘనంగా సత్కరించింది. వరలక్ష్మీ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పెట్టి తానూ భుజించింది. లోక ఉపకారం కోసం చారుమతి అందరితో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేసిందని అందరూ ఆమెను కీర్తించారు. ఆనాటి నుంచి అందరూ ఈ వ్రతాన్ని చేయడం మొదలు పెట్టారని వేదపండితులు తెలిపారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.