Vande Mataram New Guidelines : కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై అధికారిక కార్యక్రమాల్లో 6 చరణాలు తప్పనిసరి!
Vande Mataram New Guidelines : భారత స్వాతంత్ర్య పోరాటంలో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం” గేయం రచించబడి 150 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గేయానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ హోం మంత్రిత్వ శాఖ గురువారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
కొత్త మార్గదర్శకాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ప్రోటోకాల్ ప్రకారం వందేమాతరం ఆలపించే విధానంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి:
- ఆరు చరణాలు : ఇప్పటివరకు ఉన్న సంప్రదాయానికి భిన్నంగా, ఇకపై ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాలలో వందేమాతరం యొక్క అధికారిక ఆరు చరణాలను పాడటం లేదా ప్లే చేయడం తప్పనిసరి.
- పెరిగిన వ్యవధి: పూర్తిస్థాయి చరణాల ఆలాపన నేపథ్యంలో దీని వ్యవధిని 3 నిమిషాల 10 సెకన్లకు పెంచారు.
- గౌరవ సూచికంగా నిలబడాలి: అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ప్లే చేసినప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవ సూచికంగా నిలబడాలని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, సినిమా హాళ్ల వంటి బహిరంగ ప్రదేశాలకు ఈ నిబంధన వర్తించదు.
- పాఠశాలల్లో ఆరంభం: దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు జాతీయ గేయ ఆలాపనతోనే తమ రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది.
ప్రోటోకాల్– ప్రాధాన్యత
- రాష్ట్రపతి పాల్గొనే పద్మ అవార్డుల ప్రదానోత్సవం వంటి పౌర సన్మాన కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రోటోకాల్ అమలు చేయనున్నారు.
- రాష్ట్రపతి వచ్చినపుడు, నిష్క్రమణ సమయంలో ఈ గేయాన్ని ప్రదర్శించనున్నారు.
- గేయ ఆలాపనకు ముందు మృదంగ ధ్వని వినిపించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
- ఒకే వేదికపై ‘జన గణ మన’ (జాతీయ గీతం), ‘వందేమాతరం’ (జాతీయ గేయం) రెండూ ప్లే చేయాల్సి వస్తే, ముందుగా జాతీయ గీతానికే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచించారు.
150 ఏళ్ల వేడుకల సంబరం
బంకిం చంద్ర ఛటర్జీ (Bankim Chandra Chatterjee) 1875లో ‘అక్షయ నవమి’ పర్వదినం (నవంబర్ 7) నాడు వందేమాతరం స్వరపరిచారు. ఈ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పొడవునా నిర్వహించే స్మారక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశారు.
నవంబర్ 7, 2025 నుండి నవంబర్ 7, 2026 వరకు దేశవ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంస్థలలో ఉత్సవ ఆచారాలలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చర్య ప్రధాన లక్ష్యం.
భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వందేమాతరం గేయానికి సముచిత గౌరవం కల్పించే దిశగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పై ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
వందే మాతరం (Vande Mataram uncut version lyrics)
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం ॥వందే॥
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥
కోటికోటి కంఠ కలకల నినాద-కరాలే
కోటి కోటి భుజైర్ధృత-ఖర-కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల-వారిణీం మాతరామ్ ॥ వందే ॥
తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే ॥ వందే ॥
త్వం హి దుర్గా దశ-ప్రహరణ-ధారిణీ
కమలా కమలదళ-విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ ॥ వందే ॥
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరమ్ ॥
భావం
- పుణ్యప్రదములైన గంగ, యమునాది జీవనదులను కలిగిన దానవు, మధురఫల భరితవు, మలయ పర్వతముల నుండి వీచే గాలుల చేత చందనాన్ని పొంది మా సేదతీర్చే వాత్సల్యపూర్ణవు అయిన తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను
- స్వచ్ఛమైన తెలివెన్నెల చేత పరవశించిన రాత్రులు కలిగినదానవు. వికసించిన పారిజాత సుమాలతో శోభించే నిత్యమంగళ రూపానివి, దరహాస చంద్రికలతో మాపై ప్రేమామృతాన్ని కురిపించే వాత్సల్యపూర్ణవు లలితపదసంభరిత సంభాషణా చరురవు అయిన తల్లీ! నీకు ప్రణామములు.
- విజయయాత్రా సంరంభోత్సవ సమయంలో అసంఖ్యాక ప్రజల గొంతు కలలో నినదించే జయ జయ ధ్వానానివి (శబ్దానివి)
నీవు. కోట్లాది భుజాలపై ధరింపబడిన పదునైన ఖడ్గసముదాయం కల్గినదానవు. అధికాధిక బల సంపన్నురాలవైన, ప్రచండ శక్తి స్వరూపిణివి అయిన నిన్ను అబల అని పేర్కొనటంలో ఔచిత్యం లేదు తల్లీ! శత్రు మూకలను సంహరించగల బలోపేతవైన వీరమాతవు నీవు. ప్రాణికోటి సకల దుఃఖాలను పోగొట్టి తరింపజేయగల దానవు నీవే తల్లీ!
- నీవు సమస్త జ్ఞానానివి. ధర్మానివి, సకల జీవకోటిలో చేతనా కేంద్రమైన హృదయస్థానానివి. సకల జ్ఞాన సారానివి నీవు. సమస్త జీవుల ప్రాణానివి నీవు, మమ్ములను దివ్యబలసంపన్నులుగా పెంచి పోషించే వీరమాతవు నీవు. అరివీర భయంకరమైన మా భుజాంతర్నిహితమై వున్న శక్తివి నీవేతల్లీ! అమ్మా! మా అందరి హృదయాలలో జనించే భక్తి రూపానివి నీవే. ప్రతి మందిరంలోను నీ దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంటాము.
- దశవిధ ఆయుధధారిణి అయిన దుర్గవు నీవు. సకల సంపత్ ప్రదాయిని అయిన లక్ష్మీదేవివి నీవు. పరాపర విద్యా ప్రదాయిని అయిన సరస్వతీ మూర్తివి నీవు. తల్లీ! నీకు అభివాదములు. అనంతైశ్వర్య ప్రదాతవు, అనన్యసామాన్యురాలివి, పుణ్యజలపూర్ణవు, అన్నపూర్ణవు అయిన మాతృమూర్తీ! నీకు వందనములు.
- సస్యశ్యామలవు, సరళవర్తనివి, మందస్మిత వదనారవిందవు. సకలాభరణ భూషితవు అయిన మాతృమూర్తీ! విశ్వజననీ! నీకు శతాధిక వందనాలు. శతసహస్ర ప్రణామములు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

