Train Tickets Booking | రైలు ప్రయాణికులకు అలర్ట్.. ట్రెయిన్ టికెట్ల బుకింగ్‌లో కొత్త నిబంధనలు
Train Tickets Booking | రైలు టికెట్లు కొనుగోళ్లలో పాత నిబంధనలే మరలా అమల్లోకి వచ్చాయి. సాధారణంగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునేవారికి కొందరికే బెర్తులు అందుబాటులోకి వస్తాయి. మిగతా అందరికీ వెయిటింగ్ లిస్టులో చూపిస్తుంది. అయితే ప్రయాణికులకు ప్రయాణం చేసే రోజుకు బెర్తు దొరుకుతుందిలే అనే నమ్మకంతో వెయిటింగ్ లిస్టు టికెట్లు తీసుకుని రిజర్వేషన్ బోగీలోనే ప్రయాణం చేస్తుంటారు.
వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో ప్రయాణించేవారిని టికెట్ కలెక్టర్ జరిమానా విధించడంతోపాటు వారిని రైలు నుంచి కిందకు దింపే అధికారం ఉంటుంది. మరోవైపు వెయిటింగ్ లిస్టు టికెట్ కలిగిన ప్రయాణికులు ఏసీ కోచ్ లో ప్రయాణం చేయొద్దనే నిబంధన కూడా ఉంది. ఇన్ని రోజులు అంతగా పట్టించుకోని రైల్వే అధికారులు ఇకనుంచి ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి భారతీయ రైల్వే నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వెయిటింగ్ లిస్టు టికెట్లపై ప్రయాణించే ఎంతో మంది ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది..
ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ కోచ్ లు
ఆన్ లైన్ లో తీసుకునే వెయిటింగ్ లిస్టు టికెట్లపై రైల్వే అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నిబంధన చాలా సంవత్సరాల నుంచే అమలవుతోందని, కానీ ఎవరూ పాట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి వెయిట్ లిస్టు టికెట్ తో రిజర్వుడ్ కోచ్ లలో ప్రయాణిస్తే రూ.440 జరిమానా విధించనున్నారు. రైలు నుంచి దిగాల్సి ఉంటుంది. లేకపోతే జనరల్ బోగీకి పంపించే అధికారం టికెట్ కలెక్టర్లకు ఉంటుంది. ఇదిలా ఉండగా చాలామంది జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ కోచ్ లతో ఎక్కుతుంటారు. ఇలాంటి ప్రయాణికులతో ఒక్కోసారి ఏసీ బోగీలు కిక్కిరిసిపోతుంటాయి. ఇలాంటి వీడియోలు, ఫొటోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇకనుంచి టికెట్ కలెక్టర్లు తీవ్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇలాంటి వారికి జరిమానాలు విధించి రైల్వేకు భారీ ఆదాయాన్ని తేవాలని ఆదేశించింది. అంతేకాకుండా జనరల్ టికెట్ ప్రయాణికులు ఊరటన నిచ్చేలా ప్రతీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలను జత చేసినట్లు వెల్లడించింది.