Telangana Budget | తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇండ్లు లేని నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. నిరుపేదలకు గూడు సమకూర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని బడ్జెట్ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదలను ముంచిందని విమర్శించారు. నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి.. ఇళ్లు కేటాయించలేదని ఆరోపించారు. అయితే పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రారంభించామని చెప్పారు. పేద ప్రజలు ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం అందించనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 50 వేల గృహాల నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు..
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యానవన పంటలను ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. ఉద్యాన పంట కోసం బడ్జెట్‌లో రూ.737 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. ప్రభుత్వం నకిలీ విత్తనాలను నివారించడంలో కఠినంగా వ్యవహరిస్తోందని సభలో ప్రకటించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందిస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సన్న వడ్డు పండించే రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా పంటల దిగుబడిని పెంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
రైతు కూలీలకు ఏటా రూ.12వేల సాయం
రాష్ట్రంలో రైతు కూలీలకు ఎలాంటి ఆర్థిక భరోసా ఉండడం లేదు. పని దొరకని రోజుల్లోవారి కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి సొంత భూములు లేవని, దీంతో వాళ్లు రైతు కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలని, అందుకే భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..