Telangana Road ways | మోదీ 3.0 ప్రభుత్వంలో మొదటి 100 రోజుల ప్రణాళికలో తెలంగాణకు రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి రెండు రహదారులకు అవకాశం కల్పించారు. అందులో ఆర్మూరు – జగిత్యాల – మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ రోడ్డు.. జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరుసల హైవే నిర్మించాలని నిర్ణయించారు. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563 లకు మహర్దశ వచ్చినట్లైంది. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
నిజామాబాద్ – ఛత్తీస్ గడ్ హైవే..
నిజామాబాద్–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్ మధ్య ఉన్న నేషనల్ హైవే 63ను విస్తరించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా పెద్ద పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రహదారిని విస్తరిస్తారు. ఇలా ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా వెళ్లే ఈ రహదారి పొడవు 131.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఈ మార్గంలో 6 నుంచి 12 కిలోమీటర్ల మేర భారీ బైపాస్‌లు నిర్మించనున్నారు. ఇవే కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లను కూడా నిర్మించనున్నారు. రహదారుల క్రాసింగ్‌ల వద్ద భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఈ నేషనల్ హైవేపై దాదాపు 46 వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలను నిర్మించనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.3,850 కోట్లుగా అంచనా వేశారు..
జగిత్యాల – ఖమ్మం హైవే..
ఇక జగిత్యాల నుంచి ఖమ్మం ( Jagityal -Khammam Road ways ) వరకు ఉన్న ఎన్‌హెచ్–563లో 58.86 కిలోమీటర్ల పొడవు ఉన్న మరో ప్రాజెక్టుకు సంబంధించి 6 నెలల క్రితమే టెండర్లు పూర్తయ్యాయి. అయితే గత టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని కేంద్రం నిర్ణయించింది. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వందరోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. దీనికి రూ.2,151 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా.. ఇప్పుడు ఆ వ్యయం రూ.2,300 కోట్లకు పెరిగింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..