రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
52 వంతెనలు ధ్వంసం.. నేలకూలిన 5,557 విద్యుత్ స్తంభాలు
పంటనష్టం, పరిహారంపై సోమవారం మంత్రి వర్గ సమావేశం
హైదరాబాద్ : తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 52 వంతెనలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో వివరాలు పేర్కొన్నారు.
వర్షాలు, వరద నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించగా, 16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి తదితర పంటలు ముంపునకు గురయ్యాయని ప్రాథమికంగా అంచనా వేశారు.
30,000 ఎకరాల్లో కూరగాయల పంటలు కొట్టుకుపోయాయని, గ్రామాల్లో 700 కిలోమీటర్లకు పైగా పంచాయతీ రోడ్లు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, పట్టణాలు, నగరాల్లో 23,000 ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయని నివేదికలు వెల్లించాయి.
మరమ్మతు పనులకు అవసరమైన నిధులు, బాధిత ప్రజలకు నష్టపరిహారం కోసం రాష్ట్ర మంత్రివర్గం సోమవారం చర్చించనుంది. చీఫ్ సెక్రటరీ ఈ నివేదికపై చర్చించడంతోపాటు ఆమోదం కోసం మంత్రివర్గం ముందు ఉంచనున్నారు. జాతీయ రహదారులపై 13 వంతెనలు, రాష్ట్ర రహదారులపై 39 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో రవాణాపై తీవ్ర ప్రభావం పడిందని జిల్లా కలెక్టర్లు ప్రధాన కార్యదర్శికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నారు. కనెక్టివిటీని పునరుద్ధరించడానికి వీటికి తక్షణ మరమ్మతులు అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దెబ్బతిన్న వంతెనల్లో అత్యధికంగా 15 గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండగా, కరీంనగర్ జిల్లాలో 14, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10, ఆదిలాబాద్ జిల్లాో 5 ఉన్నాయి. కాల్వలు, వాగులు పొంగిపొర్లడంతో దాదాపు 250 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.
విద్యుత్ శాఖ అందించిన శాఖల వారీ వివరాల ప్రకారం మొత్తం 5,557 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 538 ట్రాన్స్‌ఫార్మర్లు, 130 సబ్‌స్టేషన్లు నీటిలో మునిగిపోగా, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ పరిధిలో 34 ట్రాన్స్‌ఫార్మర్లు, రెండు సబ్‌స్టేషన్లు నీట మునిగాయి.
గ్రామాల్లో తాత్కాలిక రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు రూ.30 కోట్లు, కొట్టుకుపోయిన కల్వర్టుల మరమ్మతులకు రూ.391 కోట్లు అవసరమవుతాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. 117 చోట్ల గుంతల మరమ్మతులకు మరో రూ.42 కోట్లు అవసరమని శాఖ
పేర్కొంది.
పట్టణ ప్రాంతాల్లో 53 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని, 18 కిలోమీటర్లకు పైగా డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని, 51 కల్వర్టులు దెబ్బతిన్నాయని మున్సిపల్ శాఖ నివేదించింది. దాదాపు 16 లక్షల ఎకరాల్లో పత్తి, వరి పంటలు ముంపునకు గురయ్యాయని వ్యవసాయ శాఖ నివేదించింది.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..