Cancer Treatment | క్యాన్సర్ రోగులకు శుభవార్త.. క్యాన్సర్ రాకుండా మాత్రలు కనుగొన్న టాటా ఇన్‌స్టిట్యూట్
Cancer Treatment | ముంబై: ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ కు భారతదేశంలో ప్రసిద్ధమైన క్యాన్సర్ పరిశోధన, చికిత్సా సంస్థగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ అసమానమైన ఘనతను సాధించింది. రెండవసారి క్యాన్సర్ రాకుండా నిరోధించే చికిత్సను కనుగొన్నట్లు పేర్కొంది.
ఇన్‌స్టిట్యూట్‌లోని పరిశోధకులు, వైద్యులు పదేళ్లపాటు శ్రమించి ఇప్పుడు ఒక టాబ్లెట్‌ను అభివృద్ధి చేశారు, ఇది రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నిరోధించగలదని, రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం తగ్గించగలదని వారు పేర్కొన్నారు.
పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాన్సర్ పై పరిశోధన కోసం ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. ఇది వాటిలో కణితిని ఏర్పరుస్తుంది. అప్పుడు ఎలుకలు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స చేస్తారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు, అవి క్రోమాటిన్ కణాలు అని పిలువబడే చిన్న ముక్కలుగా విరిగిపోతాయని గుర్తించారు. ఈ కణాలకు రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే గుణం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశించినప్పుడు, అవి వాటిని క్యాన్సర్‌గా మార్చుతుంది.
టాటా మెమోరియల్ సెంటర్ (TMC) పరిశోధనలో చనిపోయే క్యాన్సర్ కణాలు సెల్-ఫ్రీ క్రోమాటిన్ కణాలను (cfChPs లేదా క్రోమోజోమ్‌ల శకలాలు) విడుదల చేస్తాయి, ఇవి ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్‌గా మారుస్తాయి. కొన్ని cfChPలు ఆరోగ్యకరమైన క్రోమోజోమ్‌లతో కలిసిపోయి కొత్త కణితులకు కారణం కావచ్చు.
అయితే “ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి, వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్ కాపర్ (R+Cu) కలిగిన ప్రో-ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు” అని డాక్టర్ బద్వే చెప్పారు. R+Cu ఆక్సిజన్ రాడికల్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుంది.
R+Cu మాత్రలు నోటి ద్వారా తీసుకున్నప్పుడు, కడుపులో ఆక్సిజన్ రాడికల్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రక్త ప్రసరణలోకి త్వరగా శోషించబడతాయి. ఆక్సిజన్ రాడికల్స్ ప్రసరణలో విడుదలైన cfChPలను నాశనం చేస్తాయి. ‘మెటాస్టేజ్‌లను’ నిరోధిస్తాయి – క్యాన్సర్ కణాలను శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి తరలించడం. కీమోథెరపీ టాక్సిసిటీని R-Cu నిరోధిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ టాబ్లెట్ క్యాన్సర్ చికిత్స.. చికిత్స ద్వారా వచ్చే దుష్ప్రభావాలను 50 శాతం తగ్గిస్తుంది. రెండవసారి క్యాన్సర్‌ను నివారించడంలో 30% ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌పై కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
CancerTablet కేవలం రూ.100కే..
“టాటా వైద్యులు దాదాపు ఒక దశాబ్దం పాటు ఈ టాబ్లెట్‌పై పని చేస్తున్నారు. ట్యాబ్లెట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆమోదం కోసం వేచి ఉంది. TIFR శాస్త్రవేత్తలు ఈ టాబ్లెట్‌ను ఆమోదించడానికి FSSAIకి దరఖాస్తు చేసుకున్నారు. ఆమోదం పొందిన తర్వాత, ఇది జూన్-జూలై నుండి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడంలో ఈ టాబ్లెట్ చాలా వరకు సహాయపడుతుందని సీనియర్ క్యాన్సర్ సర్జన్ చెప్పారు.
“చికిత్స కోసం బడ్జెట్ లక్షల నుండి కోట్ల వరకు ఉంటుంది. ఈ టాబ్లెట్ ప్రతిచోటా కేవలం ₹ 100కి అందుబాటులో ఉంటుంది” అని ఆయన చెప్పారు.
డాక్టర్ మాట్లాడుతూ, “ఎలుకలు మానవులపై దుష్ప్రభావాలపై ప్రభావం పరీక్షించాం. కానీ నివారణ పరీక్ష ఎలుకలపై మాత్రమే జరిగింది. దీని కోసం మానవ పరీక్షలు పూర్తి చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పడుతుంది. పరిశోధన సమయంలో సవాళ్లు ఎదురవుతాయి.. ఇది సమయం.. డబ్బు వృధా అని చాలామంది భావించారు. కానీ ఈరోజు అందరూ సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇది పెద్ద విజయం. అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.