New Traffic Rules: రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇలాంటి తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు!
New Traffic Rules | తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకువచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రహదారులను విస్తరిస్తుండడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సారథి వాహన్ పోర్టల్‌పై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాలను వెల్లడించారు. సారథి వాహన్ పోర్టల్ (Sarathi Portal) లో తెలంగాణ రాష్ట్రం కూడా చేరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.28ను అమలు చేసిందని చెప్పారు. 12 నెలల్లోనే రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్డ్ చేశామని తెలిపారు. ప్రైవేటు వాహనాల వలంటరీ స్క్రాపింగ్ పాలసీ (Scrappage Policy ) కింద కొత్త వాహనాలు కొనుగోలు చేసేటపుడు ట్యాక్స్ లో మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు.
వాహనాలను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆటోమెటిక్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వాటి ద్వారానే వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను అందిస్తామని చెప్పారు. అలాగే డ్రైవింగ్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రధాన రహదారులపై రోడ్ సేఫ్టీ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో రాష్ డ్రైవింగ్ చేసిన 8 వేల మందికి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశామని మంత్రి వివరించారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నళ్లపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారి డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..