Medaram Maha Jatara 2024 : మేడారం జారతరకు వెళ్తున్నారా? అయితే ఈ ఆలయాలను మిస్ కావొద్దు..
Medaram Maha Jatara 2024 Updates: సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే జాతర ప్రాంగణంలో సమ్మక్క – సారక్క గద్దెలనే కాకుండా మరెన్నో చూడదగిన ప్రాంతాలు ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. కాగా మేడారం వచ్చే భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెలు, జంపన్నవాగు, తోపాటు ఇక్కడి స్టాళ్లు, ఎగ్జిబిషన్లను చూసి వెళ్తుంటారు. అయితే ఇవే కాకుండా మేడారం ప్రాంతంలో ఇంకా చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలను కూడా దర్శించుకోవచ్చు. జాతరలో మూడు, నాలుగు రోజులు గడిపే భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని నేరుగా ఇండ్లకు పయనమవుతుంటారు. అయితే మేడారం జాతర ప్రాంగణంలోనే ఉండే జంపన్న, నాగులమ్మ గద్దెలు, సమ్మక్క, సారలమ్మ ఆలయాల గురించి చాలా మందికి తెలియదు. మరి జంపన్న గద్దె, నాగులమ్మ గద్దెలు ఎక్కడ నిర్మించారు. వాటి గురించి తెలుసుకుందాం..
మేడారంలో సమ్మక్క గుడి..
మేడారం జాతర ప్రాంగణంలోనే సమ్మక్క గుడి ఉంది. సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి ఈ గుడి కేవలం200 మీటర్ల దూరంలోనే కనిపిస్తుంది. జాతర ప్రారంభానికి ముందు గుడిమెలిగె, మండమెలిగె పండుగలు ఈ అలయంలోనే నిర్వహిస్తారు. జాతరకు వచ్చే చాలా మంది భక్తులకు ఇక్కడ సమ్మక్క గుడి ఉందనే విషయం తెలియదు. అందుకే కేవలం గద్దెలను మాత్రమే దర్శించుకుని మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణమవుతుంటారు.
కన్నెపల్లిలో సారలమ్మ గుడి
కాకతీయ పాలకులతో తల్లి సమ్మక్కతో పాటు ఆమె కుమార్తె సారలమ్మ కూడా వీరోచితంగా పోరాడింది. అందుకే సారలమ్మను కూడా భక్తిప్రపత్తులతో కొలుస్తారు. కాగా మేడారానికి స 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న కన్నెపల్లిలో సారలమ్మ గుడి ఉంది. పూజారులు, గ్రామస్తులు సారలమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా కొలుస్తారు. కాగా సంతానం కోసం పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడ వరం పడుతుంటారు. జాతర సమయంలో గుడి నుంచి అమ్మవారిని మేడారంలోని గద్దె పైకి తీసుకెళ్లే క్రమంలో తడిబట్టలతో వరం పట్టినవారిపై నుంచి అమ్మవారు దాటుకుంటూ వెళ్తే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడికి ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన భక్తులు తరలివచ్చి పూజలు చేస్తుంటారు.
జంపన్న గద్దె
మేడారంలో సమ్మక్క కుమారుడైన జంపన్న వాగు గురించి తెలియనివారుండరు.. ఇందులోనే పుణ్యస్నానాలు ఆచరిస్తారు.. అయితే ఈ వాగు పక్కనే జంపన్న గద్దె ఉంటుంది. జంపన్న వాగు సమీపంలోని స్నాన ఘట్టాలపైనే జంపన్న గద్దె ఉంది. సమ్మక్క- సారలమ్మ గద్దెలు ఏర్పాటు చేసిన కాలంలోనే జంపన్న గద్దె నిర్మించినట్లు పూజారులు చెబుతున్నారు. ఈ జంపన్న గద్దె గురించి తెలిసిన వారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
నాగులమ్మ గద్దె
సమ్మక్క అమ్మవారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. నాగులమ్మ కూడా కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందింది. కాగా సమ్మక్క, సారలమ్మతో పాటు నాగులమ్మ కు గద్దెను ఏర్పాటు చేశారు. జంపన్న వాగు స్నాన ఘట్టాల వద్ద ఈ నాగులమ్మ గద్దె ఉంటుంది. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన భక్తులు నాగులమ్మకు కూడా పూజలు చేస్తుంటారు. మేడారానికి వచ్చే భక్తుల్లో చాలా మంది మహిళలు ఈ గద్దెను ఎంతో పవిత్రంగా భావించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..