Solar Pump Set | రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?
Solar Pump Set | హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ( Solar Energy )ఉత్పత్తి పెంచేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గృహజ్యోతి పథకం (Gruha jyothi Pathakam) కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో ప్రభుత్వంపై భారం పడుతోంది. అంతేకాకుండా కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడతో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యుత్ శాఖపై బుధవారం సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచండి..
వివిధ శాఖల్లో వినియోగంలో లేని ఖాళీ భూములలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు సోలార్ పంప్ సెట్ (Solar Pump Set)లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఇందు కోసం కొండారెడ్డి పల్లి (Kondareddy Palli)ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని చెప్పారు. సోలాట్ పంప్ సెట్ ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ తో రైతులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అలాగే వంట గ్యాస్ కోసం సాధారణ ఎల్‌పీజీ గ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలని సూచించారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని, ప్రతీ సంవత్సరం 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ వినియోగంలో దుబారాను తగ్గించాలని, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి పొదుపు చేయాలని చెప్పారు. అలాగే ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలని, వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగనీయొద్దని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..