
Railway Projects in Telangana | కేంద్ర ప్రభుత్వం దేశ్యాప్తంగా కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తోంది. దీంతో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్త బడ్జెట్ కాలపరిధిలో ఆయా పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో మెదక్-అక్కన్నపేట, మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులను పూర్తి చేసింది. అలాగే ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ తో కదలిక తీసుకొచ్చింది. ఈనెల 23న ప్రవేశ పెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి బడ్జెట్లో ఆ నిధులను కేటాయించే అవకాశముంది. దీంతో ఈ సంవత్సరంలో తుది దశకు చేరనున్నట్లు భావిస్తున్నారు.
కాజీపేట- విజయవాడ, కాజీపేట బల్లార్షా మూడో లైన్
Kazipet Vijayawada Railway line : కాజీపేట- విజయవాడ మూడో లైన్ ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. కానీ, పనులు మాత్రం నత్తనడకన సాగుతూ వస్తున్నాయి. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగా రూ.647 కోట్ల నిధులు కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. అంచనా వ్యయం రూ.1,952 కోట్లు కాగా, పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100 కి.మీ. పనులు పూర్తి అయ్యాయి.
Kazipet – Balharshah Railway Line : కాజీపేట బల్లార్షా మూడో లైన్ : రైల్వే పరంగా ఉత్తర-దక్షిణ భారతదేశాలను అనుసంధానించే కాజీపేట బల్లార్షా మూడో లైన్ అత్యంత కీలకమైనది. ప్రతీరోజు 275 వరకు ప్యాసింజర్ రైళ్లు, 180 వరకు గూడ్స్ రవాణా రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ మార్గంలో మరిన్ని రైల్వే సేవలు అందించేందుకు, ఇప్పుడున్న పట్టాలపై భారం తగ్గించేందుకు మూడో లైన్ తప్పనిసరి అయింది. మూడో లైన్ అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టు లుగా చేపట్టారు. కాజీపేట-బల్లార్షా లైన్ మహారాష్ట్ర-తెలంగాణల్లో పరిధిలో కొనసాగే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 2015-16లో మంజూరైంది. దీని నిడివి 202 కిలోమీటర్లు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2063 కోట్లు కాగా, గత రెండేళ్లుగా చాలా స్టేషన్ల మధ్య మూడో లైన్ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 151 కిలోమీటర్లు పనులు పూర్తయింది. గతేడాది బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని సవరించే చాన్స్ ఉంది.
బీబీనగర్- గుంటూరు లైన్
Bibinagar to Guntur Line Doubling : కాజీపేట మీదుగా సికింద్రాబాద్-విజయవాడ మార్గం అత్యంత రద్దీగా మారడంతో మరో ప్రత్యామ్నాయ లైన్ నడికుడి మీదుగా బీబీనగర్- గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 201955 రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ. 2,853 కోట్ల అం చనా వ్యయంతో ప్రతిపాదించింది. గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించగా నిధులు మాత్రం విడుద కాలేదు. అయితే మధ్యంతర బడ్జెట్ నిధులతో ఇటీవలే టెండర్లు పిలవడంతో మళ్లీ ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. కుక్కడం-నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి కూడా. రెండేళ్లలో పనులు మరింత పురోగమించే అవకాశం ఉంది.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్
Manoharabad Kothapalli Railway Line : సిద్దిపేట మీదుగా హైదరాబాద్-కరీంనగర్ రైల్వే కనెక్టివిటీ కల్పించే కీలక ప్రాజెక్టు మనోహరాబాద్ కొత్తపల్లి లైన్. 2006-07లో ఈ ప్రాజెక్టు మంజూరు కాగా, ఐదేళ్ల క్రితం పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పొడవు 151 కిలోమీటర్లు కాగా, ఇప్పటివరకు 76 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,375 కోట్లు కాగా గతేడాది బడ్జెట్లో కేంద్రం రూ.185 కోట్లు కేటాయించింది. గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు.. సరిపడా నిధులు అందుబాటులో ఉన్నందున వచ్చే ఏడాదిలోనే పనులు దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంది.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.