Bhatti Vikramarka | నిరుపేదలకు గుడ్ న్యూస్.. భూమిలేని వారి ఖాతాల్లో రూ. 12 వేలు.. ఈ ఏడాది నుంచే అమలు..!
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
Khammam : భూమిలేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.12 వేలు జమచేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వెల్లడించారు. మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెండో విడత దళిత బంధు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పరిపాలనలోకి వొచ్చిందని, అందుకే తమ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.ఆరు లక్షలు, ఇతర లబ్ధిదారులకు రూ.ఐదు లక్షలను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం అందించనుందని తెలిపారు. రైతులకు రుణమాఫీ, పంటల బీమా, రైతు బీమా, సబ్సిడీ కరెంట్ అందించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సోలార్ వ్యవసాయ పంపు సెట్లు తీసుకొస్తున్నామని ఆయన వివరించారు.
మధిర నియోజకవర్గ పరిధిలోని సిరిపురం (Siripuram) గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్ల ఏర్పాటుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు సోలార్ పంపు సెట్లను వినియోగించుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని పేర్కొన్నారు. సోలార్ పంపు సెట్ నుంచి ఉత్పత్తయిన కరెంట్ ను వ్యవవసాయ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీనివల్ల, రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వాములు చేస్తామని చెప్పారు. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు ఇప్పిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..