AP, TG CM’s Meeting | ఇద్దరు సీఎం ల సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే..
AP, TG CM’s Meeting | తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హైదరాబాద్ లోని ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈసందర్భంగా చంద్రబాబుకు సిఎం రేవంత్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కూడా రేవంత్‌కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు.
విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై ఇద్దరు సీఎంలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ను నియంత్రించేందుకు కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. ప్రజాభవన్‌లో సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివరించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని తెలిపారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గత పదేళ్లుగా పట్టించుకోని అంశాలకు పరిష్కరించుకునేందుకు ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై ఈ భేటీలో చర్చించామన్నారు. ఈ భేటీలో రెండు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
AP, TG CM’s Meeting : ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్న తర్వాత సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో ట్రీమెన్ కమిటీని వేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు ముగ్గురు చొప్పున కమిటీలో ఉంటారన్నారు. ఈ కమిటీ సమావేశమై రెండు వారాల్లో సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాలని నిర్ణయించామని చెప్పారు. అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రుల స్థాయిలో కమిటీ వేసి పరిష్కార మార్గాలు కనుగొనాలని, మంత్రుల స్థాయిలో పరిష్కారం లభించకపోతే సీఎంల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటా నలబై ఐదు నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..